ఏపీలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల: బరిలో వీరే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం రాత్రి విడుదల చేసింది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత లోక్‌సభ బరిలో 454 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 503 మంది అభ్యర్థులకు గానూ 49 మంది నామినేషన్ల ఉపసంహరించుకున్నారు.
అత్యధికంగా విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి 33 మంది పోటీలో ఉన్నారు. కడప లోక్‌సభకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సహా 14 మంది బరిలో ఉన్నారు. నంద్యాలలో 31 మంది, గుంటూరులో 30 మంది పోటీలో ఉన్నారు.

ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 318 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 46 మంది పోటీలో ఉన్నారు.
అనకాపల్లి జిల్లా చోడవడం అసెంబ్లీ నుంచి అత్యల్పంగా ఆరుగురు పోటీలో ఉన్నారు. మంగళగిరిలో నారా లోకేష్ సహా 40 మంది బరిలో నిలిచారు. కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా 13 మంది పోటీలో ఉన్నారు.
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా 13 మంది బరిలో నిలిచారు. పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా 27 మంది పోటీలో ఉన్నారని ఎన్నికల సంఘం వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 4వ దశలో తెలంగాణ, ఏపీ లోక్‌సభ ఎన్నికలతోపాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల కౌంటింగ్, ఫలితాలు వెలువడతాయి.












Click it and Unblock the Notifications