మంత్రికి ఉద్యోగుల నుంచి నిరసన సెగ... చుట్టుముట్టి నినాదాలు
ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల నుంచి నిరసన సెగ ఎదురైంది. పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ, బదిలీలవల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. విజయవాడ సమీపంలోని ఈడుపుగల్లలో ఉన్న వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయానికి మంత్రి వచ్చారు. ఈ సందర్భంగా వారంతా మంత్రిని చుట్టుమట్టారు.
దీనిపై బుగ్గన మాట్లాడుతూ రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ సమర్ధంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే సంస్కరణలు చేపడుతున్నామని చెప్పారు. సంస్కరణలపై వచ్చిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని, ఉద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే భరోసా ఇచ్చారు. కానీ ఏ పెన్ను వాడాలో, ఏ పెన్సిల్ వాడాలో కూడా మీరే చెబుతామంటే సరికాదని హితవు పలికారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పునర్వ్యవస్థీకరణ ఉద్యోగుల హక్కులను హరించేలా ఉందని, పారదర్శకంగా లేని బదిలీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలవల్ల వాణిజ్య పన్నులశాఖ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలోని వాణిజ్య పన్నులశాఖ అధికారులు ఈనెల 13వ తేదీ నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈడుపుగల్లులోని ప్రధాన కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. రోడ్డు బాగుందంటే కొత్త రోడ్డు వేసుకోమని, ఇల్లు బాగుంటే పీకేసి కొత్త ఇల్లు కట్టుకోమని, సంస్కరణల నిర్ణయాలపై ఇంకా పరిశీలన మాత్రమే జరుగుతోందని మంత్రి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications