కోతల చంద్రశేఖర రావు: దుమ్మెత్తిపోసిన టిడిపి నేతలు
హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆరు నెలల పాలనపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ విధానాలు తెలంగాణ ముంచేలా ఉన్నాయని ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ఆరు నెలల పాలనలో అద్భుతాలు ఆశించలేదన్న ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆరోపించారు.
కేసీఆర్ వ్యవహార శైలి, భాష వల్లే ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. కేసీఆర్ తన ప్రవర్తన మార్చుకోవాలని, అబద్దాలు మానుకోవాలని సూచించారు. దళితుడిని సీఎం చేస్తానని మాట తప్పారని మండిపడ్డారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆయన అన్నారు. విద్యుత్తు వస్తుందని రైతులు పంటలు వేసి మోసపోయారని ఆయన చెప్పారు. అమరవీరులను తెరాస మోసం చేసిందని అన్నారు. ఆరు నెలలు కెసిఆర్ పొరపాట్లు చేశారని ఆయన విమర్సించారు.
సర్వేల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఎర్రబెల్లి అన్నారు. కేసీఆర్ కాదు, ఆయన కోతల చంద్రశేఖర్‌రావు అని మరో నేత రావుల చంద్రశేఖర రెడ్డి విమర్శించారు. ఆకాశమార్గాలు, వందతస్థుల భవనాలు, అరచేతిలో వైకుంఠం ఇదీ కేసీఆర్ ఆరు నెలల పాలన అని విమర్శించారు. మీడియా గొంతునొక్కడంలో మాత్రం కేసీఆర్ సక్సెస్ అయ్యారని ఎద్దేవా చేశారు.

టీడీపీకి భయపడే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించడం లేదని టీడీపీ నేత మాగంటి గోపీనాథ్‌ఆరోపించారు. ఎన్నికలు నిర్వహించకపోతే న్యాయస్థానానికి ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ ఐదేళ్ల వరకు ఎన్నికలు నిర్వహించేలా కన్పించడం లేదని మాగంటి గోపీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్త ప్రభుత్వం కాబట్టి సహకరించాం
కెసిఆర్ ఆరు నెలల పాలనలో ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని కాంగ్రెసు ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. చాలా హామీల్లో స్పష్టత లోపించి, సమస్యల ప్రభుత్వంగా అవతరించిందని ఆయన అన్నారు. లక్ష కోట్ల బడ్జెట్ బండారం నాలుగు నెలల్లో బయటపడుతుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
అన్ని రంగాల్లో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పడిపోయిందని అన్నారు. ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోయిందని చెప్పారు. ఆరు నెలల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఐదు మార్కులు మాత్రమే సాధించిందని వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వం కాబట్టి బడ్జెట్‌కు సహకరించామని షబ్బీర్ చెప్పారు.
పోలవరంపై కేంద్రాన్ని ఆశ్రయించండి
పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్పు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లాలని కాంగ్రెసు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. ఈ అంశంపై అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన మీడియాతో అన్నారు. ప్రాజెక్టు అథారిటీలో తెలంగాణ వారిని లేకుండా చేశారని, దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని ఆయన అన్నారు.
రెండు రాష్ట్రాల మధ్య పలు అంశాలపై చోటు చేసుకున్న వివాదాలు పరిష్కారం కాలేదని, దీంతో కేంద్రం జోక్యం చేసుకునే పరిస్థితి తలెత్తిందని ఆయన అన్నారు. 180 రోజుల పాటు కెసిఆర్ పాలనలో 18 అంశాలు మాత్రమే అరకొరగా అమలయ్యాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications