బాబుకు షాక్: ఎర్రబెల్లి సహా 3గురు ఎమ్మెల్యేలు, ఎంపి
హైదరాబాద్: తెలంగాణ సామాజిక కోణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణలో ఎదురు తిరిగే ప్రమాదం ఉంది. సామాజిక తెలంగాణను ఏర్పాటు చేస్తానని, తెలంగాణ రాష్ట్రానికి బిసి నేతను ముఖ్యమంత్రిగా చేస్తానని చంద్రబాబు సీమాంధ్ర సభల్లో హామీ ఇస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో లుకలుకలు, అసంతృప్తి తీవ్రమైనట్లు చెబుతున్నారు.
తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు తాత్కాలికంగా మాత్రమే పార్టీతో సర్గుకుపోయినట్లు భావిస్తున్నారు. ఆయన పార్టీని వీడడం ఖాయమని అంటున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు శాసనసభ్యులు, ఓ పార్లమెంటు సభ్యుడు కూడా తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు.

ఎర్రబెల్లి దయాకర్ రావుకు కాంగ్రెసు పార్టీ నుంచి అహ్వానం ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విలీనానికి అంగీకరించకపోవడంతో తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ నాయకులను తమ వైపు లాక్కునేందుకు కాంగ్రెసు అధిష్టానం పెద్దలు స్వయంగా రంగంలోకి దిగారని అంటున్నారు. వారు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఫోన్లు చేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణకు ప్రత్యేక కమిటీ వేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆ కమిటీ నేతృత్వాన్ని తాను దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్‌గా పనిచేసినందున నాయకత్వ బాధ్యతలు తనకే ఉండాలనేది ఆయన అభిప్రాయంగా కనిపిస్తోంది. అయితే, ఒక వేళ కమిటీ ఏర్పాటు చేస్తే నాయకత్వం కోసం తెలుగుదేశం తెలంగాణ నేతల్లో పోటీ తీవ్రంగానే ఉంది.
తెలంగాణ కోసం కమిటీ వేసే వరకు నిరీక్షించాలని దయాకర్ రావు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. నలుగురైదుగురు సభ్యులతో సమన్వయ కమిటీ వేస్తే పార్టీ నుంచి తప్పుకోవాలని దయాకర్ రావు అనుకుంటున్నట్లు చెబుతున్నారు. బిసిని తెలంగాణకు ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించడం కూడా ఎర్రబెల్లి దయాకర్ రావుకు నచ్చలేదని చెబుతున్నారు.
ఇప్పటికే 15 మంది శాసనసభ్యుల దాకా పార్టీని వీడారు. కొద్ది కాలంలో మరింత మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీని వీడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, శాసనసభ్యులు పార్టీని వీడినంత మాత్రాన తాను భయపడబోనని చంద్రబాబు ఓ సందర్భంలో అన్నారు. కానీ, తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజుకు రోజుకూ తీసికట్టుగా మాత్రం తయారవుతోంది.












Click it and Unblock the Notifications