సిఎంను తప్పించి చేయాలి, డ్రామలొద్దు: ఎర్రబెల్లి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించి, తెలంగాణ బిల్లు వచ్చే ఎన్నికల లోపు పార్లమెంటు ఆమోదం పొంది, రెండు రాష్ట్రాలు ఏర్పడే విధంగా చూడాలని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరగాలని ఆయన అన్నారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ వ్యవహారం చూస్తుంటే డ్రామాలు ఆడుతున్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. తెలుగుదేశం తెలంగాణ నేతల సమావేశానంతరం ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో వెంటనే చర్చ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లుపై జాప్యం చేయడానికి ప్రయత్నిస్తే సహించబోమని ఆయన అన్నారు. తమ పార్టీ సీమాంధ్ర శాసనసభ్యులు సమన్యాయం మాత్రమే కోరుతున్నారని, తెలంగాణను వ్యతిరేకించడం లేదని ఆయన అ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అందరూ సహకరించాలని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అందరూ స్వాగతించాలని ఆయన కోరారు. సోమవారం శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లును ప్రవేశపెడితే వారం రోజుల్లో చర్చను ముగించి కేంద్రానికి పంపడానికి వీలవుతుందని ఆయన అన్నారు.
శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చేయడానికి ఏమీ లేదని, శాసనసభ అభిప్రాయం మాత్రమే చెబుతుందని, ఈ స్థితిలో శాసనసభకు బిల్లు రాకుండా చూడడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. బిల్లు వచ్చిన తర్వాత కూడా సభ్యులకు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. బిల్లు ప్రతులను శుక్రవారంనాడు ఇచ్చి ఉంటే సభ్యులు శనివారం, ఆదివారం చదువుకుని ఉండేవారని ఆయన అన్నారు. తెలంగాణ శాసనసభ్యులంతా ఒక తాటిపై నిలబడి అసెంబ్లీలో విజయవంతంగా చర్చ జరిగేలా చూసి ఢిల్లీకి పంపించడానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం డొంక తిరుగుడుగా వ్యవహరిస్తే పోరాటం చేయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications