బాబు ఢిల్లీ యాత్ర ఎందుకు: ఈటెల, జెపిపై ఫైర్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఢిల్లీ పర్యటన వెనక ఉన్న ఉద్దేశ్యం ఏమిటో ప్రజలకు తెలియజేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. లోకసత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. అందులో భాగంగానే జెపి తెలుగుతేజం పేరిట యాత్ర చేపట్టారని అన్నారు.
ఆంధ్ర ప్రాంతానికి చెందిన పార్టీలన్నీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ స్థితిలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆనయ అన్నారు. తెలంగాణను అడ్డుకోవడానికి జయప్రకాష్ నారాయణ మూర్ఖపు ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. జెపి తనకు తాను మేధావిని అని అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా మాట్లాడిన జెపికి చదువు వస్తుందా, జ్ఝానం ఉందా అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోందని ఆయన అన్నారు. ఆంధ్ర పార్టీల నేతలు ఒక్కరొక్కరే తమ నిజస్వరూపాన్ని బయట పెట్టుకుంటున్నారని ఆయన అన్నారు.
భౌగోళికంగా అన్ని రంగాలకు హైదరాబాద్ వేదిక అని, హైదరాబాదులో సీమాంధ్ర నేతలు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. 400 ఏళ్ల క్రితమే హైదరాబాద్ గొప్ప నగరమనే విషయాన్ని జెపి గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన అన్నారు. చంద్రబాబు ఆటలు ఇక సాగవని ఆయన అన్నారు. చంద్రబాబు బాటలో జెపి నడవడం దారుణమని ఆయన అన్నారు.
జెపి ఓ విషపు పురుగు అని తెలంగాణ ఎన్టీజివోల నాయకుడు శ్రీనివాస గౌడ్ విమర్శించారు జెపి తెలివి ఉన్న అజ్ఝాని అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా జెపి మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. జెపికి తెలంగాణ ప్రజలు తగిన శాస్త్రి చేస్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications