నాన్న మనసు వెన్న.. హ్యాపీ ఫాదర్స్ డే
మంచుకన్నా చల్లని మనసు.. అమ్మ ప్రేమను గెలిపించడానికి తాను కావాలని వెనకబడే నాన్న ప్రేమ.. చినుకులా మొదలై కడలిలా ముంచెత్తుతుంది. మన గెలుపులో వెన్నంటి ఉంటూనే చాటుగా మురిసేవాడు నాన్న. గాలిపటం లాంటి మన జీవితం ఎంత ఎత్తుకు ఎగరాలన్నా దానికి ఆధారమైన దారమే నాన్న ప్రేమ. జన్మనిచ్చినప్పటి నుంచి ఆ జన్మ సార్థకమయ్యేంతవరకు మనల్ని గమ్యంవైపు పయనింపచేసే బాటసారి.
ప్రేమకు ప్రతిరూపం అమ్మ అయితే, అనురాగానికి ప్రతిరూపం నాన్న. పిల్లలపై తనకు ఎంతో ప్రేమ ఉందనే విషయాన్ని నాన్న ఎప్పుడూ బహిర్గతపరచడు. తన మనసులోనే దాచుకుంటాడు. దూరం నుంచే అన్నీ గమనిస్తుంటాడు. తల్లి జన్మనిస్తే ఆ జన్మకు రక్షణ నాన్న. వెలకట్టలేని త్యాగాలెన్నో నాన్న సొంతం. తల్లి వల్ల కాస్తంత వెనకబడ్డప్పటికీ తండ్రి కూడా ముందు వరుసలోనే ఉంటాడు.

సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఫాదర్స్ డేను ప్రారంభించింది. తల్లి లేకపోవడంతో తన తండ్రి తనను ఎంత బాగానో ప్రేమించి పెద్ద చేస్తాడు. కూతురిపై ఆ తండ్రికున్న నిస్వార్థ ప్రేమ, అంకిత భావాన్ని గమనించిన డాడ్ తండ్రి కోసం ప్రత్యేకంగా ఒకరోజు ఉండాలనే భావనతో ప్రచారం మొదలుపెట్టింది. ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగానే 1910లో అమెరికాలో మొదటిసారిగా ఫాదర్స్ డేను జరుపుకున్నారు. 1966వ సంవత్సరంలో, ప్రెసిడెంట్ లిండన్ జాన్సన్ జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డేగా జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి దీన్ని ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారం జరుపుకుంటున్నారు.
అమ్మ గెలిచినప్పుడు నాన్న ఓడిపోతాడు. అయితే ఆ అమ్మను గెలిపించడం కోసం నాన్న కావాలనే ఓడిపోతుంటాడు. ఇందులో ఉన్న త్యాగమే తన పిల్లలపై తండ్రికున్న ప్రేమ. మన జీవితాలను అత్యంత బలీయంగా ప్రభావితం చేస్తాడు. కానీ ఏ తండ్రీ తాను పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో బహిర్గత పరచడు. ఆ ప్రేమను చూపిస్తాడు అంతే. ప్రేమించడానికి హృదయం, పైకి లేపడానికి తన చేతులు, మద్దతివ్వడానికి తన భుజాలు, భరోసా ఇవ్వడానికి చిరునవ్వు, ప్రపంచంలోకి పంపించడానికి బెస్ట్ విషెస్ ఇస్తాడు. తాను పిల్లల్ని పొందానని చెప్పడు.. వారికి సమీపంలోనే ఉంటానని చెప్పడు. ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటానని అసలు చెప్పడు.. కానీ అవన్నీ మాటలతో కాకుండా చేతలద్వారా చూపిస్తాడు. ఎవరూ ఇవ్వలేని, ఎవరూ కల్పించలేని రక్షణను మన జీవితానికి కల్పించే గొప్ప అంగరక్షకుడు నాన్న.












Click it and Unblock the Notifications