ఏపీ నూతన మద్యం పాలసీ పేరుతో భారీ కుంభకోణం!
ఏపీలో మద్యం పాలసీపై వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. మద్యం సిండికేట్లు కూటమి నేతలేనని విమర్శలు గుప్పిస్తుంది. మద్యం పాలసీలో పారదర్శకత అని చెప్తున్న చంద్రబాబు పారదర్శకంగా చేసింది ఏమీ లేదని మండిపడుతుంది.ఈ క్రమంలో తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చంద్రబాబును టార్గెట్ చేశారు.
తమ వారికి సంపద సృష్టి కోసమే నూతన మద్యం పాలసీ
చంద్రబాబు ఎన్నికల ముందు సంపద సృష్టి అని చెప్పారని, అంటే రాష్ట్రానికి సంపద సృష్టిస్తారని అందరూ అనుకున్నారని, కానీ మద్యం పాలసీ, వైన్‌షాప్‌ల కేటాయింపు చూసిన తర్వాత, తమ వారికి సంపద సృష్టి చేస్తున్నారని, వాస్తవ పరిస్థితి అందరికీ అర్ధమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.

కూటమి నాయకులకే ఎక్కువ లిక్కర్ షాప్‌లు
ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన సంపద సృష్టికి అర్ధం ఇప్పుడు అర్ధమైందని, కేవలం తెలుగుదేశం పార్టీతో పాటు, కూటమి నాయకులకు మాత్రమే సంపద సృష్టించడం అన్నట్లుగా తేలిందని ఆయన వెల్లడించారు. ఆ దిశలోనే నిన్న జరిగిన మద్యం షాప్‌ల కేటాయింపుల్లో అన్ని చోట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి ప్రజా ప్రతినిధులకు ఎక్కువ షాప్‌లు దక్కాయని గుర్తు చేశారు.
నూతన మద్యం పాలసీ పేరుతో పెద్ద కుంభకోణం
లిక్కర్ టెండర్లు వేసింది అంతా టీడీపీ నేతలే అన్నారు. అందరూ సిండికేట్ లుగా మారి సంపద సృష్టి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ పేరుతో పెద్ద కుంభకోణం జరిగిందని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి, తెలుగుదేశం నాయకుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా మద్యం పాలసీ ఉందన్నారు. అందుకు అనుగుణంగానే వైన్‌షాప్‌ల కేటాయింపు కూడా జరిగింది అని గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు.
వైసీపీ హయాంలో మద్యం విధానంలో మేం చేసిందిదే
2019లో తాము అధికారంలోకి రాగానే మద్యం విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43 వేల బెల్టుషాప్‌లు రద్దు చేశామని, అలాగే 4500 వైన్‌షాప్‌లు ఉంటే, వాటిని 2900కి తగ్గించామని పేర్కొన్నారు. ఆ విధంగా పేద కుటుంబాలను రక్షించి, వారిని మద్యం బారి నుంచి కాపాడాలని చూశామని చెప్పారు.
చంద్రబాబు హయాంలో ఇంటింటికీ మద్యం పంపిణీ పథకం
చంద్రబాబు ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీతో రానున్న రోజుల్లో వీధికో బెల్టు షాపు ఉంటుందని, అలాగే ఇంటికే మద్యం సరఫరా మొదలు పెడతారని పేర్కొన్నారు. చంద్రబాబు ఇంటింటికీ మద్యం పంపిణీ పథకాన్ని ప్రవేశపెడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి మద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు.
మద్యం పాలసీ రద్దుకు డిమాండ్
మద్యం పాలసీ రద్దు చేయాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి, ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే, ప్రజల పక్షాన పోరాడతామని ప్రకటించారు. మద్యంపై పేదప్రజలు కూడా తప్పకుండా తిరగబడతారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications