ఏపీలో నిలిచిపోనున్న ఆరోగ్యశ్రీ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యభద్రతకు తూట్లు పొడుస్తోందని మాజీ మంత్రి విడదల రజని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యంపై ప్రజల్లో పెద్ద ఆందోళన నెలకొందన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు లేవని, నెట్వర్క్ ఆసుపత్రులకు డబ్బులు ఇవ్వలేం కాబట్టి అందరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు విడదల రజిని.
ఏపీలో ఆందోళనలో ప్రజారోగ్యం
కేంద్ర మంత్రి పెమ్మసాని నోట్లోనుంచి వచ్చిన మాటలు చంద్రబాబు ఆలోచనలే అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇచ్చేది రూ.5 లక్షలే అని పేర్కొన్న విడదల రజిని వైయస్.జగన్ హయాంలో ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచితంగా అందించారని గుర్తు చేశారు. ఏపీలో ప్రజారోగ్యం ఆందోళనలో పడింది అన్నారు. ఆయుష్మాన్ భారత్ ఏపీలో కేవలం 60 లక్షల మందికే వర్తిస్తుందని విడదల రజిని పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వంపై మంత్రి వ్యాఖ్యలు అభ్యంతరకరం
రాష్ట్రంలో 1 కోటి 42 లక్షల మంది ఆరోగ్యశ్రీ కార్డు లబ్ధిదారులున్నారని, ఆయుష్మాన్ భారత్లో లేని మిగిలిన వారి పరిస్థితి ఏంటి? అని ప్రభుత్వాన్ని విడదల రజిని ప్రశ్నించారు. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి వెళ్లందన్న మంత్రి వ్యాఖ్యలు అభ్యంతరకం అని పేర్కొన్న విడదల రజిని ప్రతినెలా ఆరోగ్య శ్రీ-ఆసరా కింద సమారు రూ.340కోట్లకుపైనే ఖర్చు చేశామని, ఎన్నికల కోడ్ రావడంతో మార్చినుంచి చెల్లింపునకు అడ్డంకులు ఏర్పడ్డాయని అన్నారు.
ఏపీలో ఆరోగ్య శ్రీ నిలిపివేసే ప్లాన్ లో ప్రభుత్వం
ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం సాకులు చెప్తోందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఫలితంగా ప్రభుత్వమే ఆరోగ్య శ్రీ కింద సేవలు నిలిపివేసే పరిస్థితిని ఉద్దేశ పూర్వకంగా తీసుకు వస్తోందని మండిపడారు. చంద్రబాబు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించి, ప్రొసీజర్లను పెంచి, ఆరోగ్య శ్రీ పరిమితిని పెంచి పేదలకు జగన్ ప్రభుత్వం మంచిచేసిందని ఈ సందర్భంగా విడదల రజిని గుర్తు చేశారు.

ఆరోగ్యశ్రీ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్
కాని ఈ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలన్న ఆరోగ్య బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం ఆరోగ్యశ్రీ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ, వైద్యశాఖలో నాడు-నేడు, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని విడదల రజిని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వైద్య ఆరోగ్యశాఖపై ప్రభుత్వ విధానమేంటి?
అధికార పార్టీ నేతల వైఖరి ద్వారా వైద్యారోగ్య రంగం వారికి ప్రాధాన్యతగా లేనట్టేనని స్పష్టం అవుతోందని పేర్కొన్న విడదల రజిని ఈ ఏడాది కొత్తగా ఐదు మెడికల్ కాలేజీల్లో తరగతుల ప్రారంభంపై మీనమేషాలు లెక్కిస్తోందని, దీనిపై స్పష్టత ఇవ్వాలన్నారు. మొత్తంగా వైద్య ఆరోగ్యశాఖపై ప్రభుత్వ విధానమేంటన్నది కూటమి ప్రభుత్వం కచ్చితంగా స్పష్టత ఇవ్వాలని ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications