కేశినేని నానికి లగడపాటితో చెక్ - టీడీపీలో మారుతున్న సమీకరణాలు..!!
టీడీపీ ఎంపీ కేశినేని కి చెక్ పెట్టేందుకు కొత్త ప్రతిపాదనలు తెర మీదకు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కేశినేని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సొంత పార్టీ నేతలే కేశినేని వ్యాఖ్యలను తప్పు బడుతున్నారు. ఈ సమయంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసేందుకు పలువురి పేర్లు తెర మీదకు వస్తున్నాయి. అందులో మాజీ ఎంపీ లగడపాటి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో పాటుగా మరో ముగ్గురు రేసులో ఉన్నారు. దీంతో, విజయవాడ రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారుతోంది.
విజయవాడ రాజకీయం
విజయవాడ టీడీపీ రాజకీయం కేశినేని నాని కేంద్రంగా నడుస్తోంది. కొంత కాలంగా కేశినేని వ్యాఖ్యలతో ఆయన వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. తనకు వ్యతిరేకంగా తన సోదరుడిని టీడీపీ నేతలు ప్రోత్సహిస్తున్నారనేది కేశినేని ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. విజయవాడ లోక్ సభ పరిధిలోని సొంత పార్టీ నేతల తీరు..వ్యాఖ్యలతో కేశినేని రగిలిపోతున్నారు. కేశినేని తాజా వ్యాఖ్యల పైన పార్టీ నాయకత్వం స్పందించలేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కొత్త అభ్యర్ధుల పేర్లు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పుడు జనసేన, బీజేపీతో పొత్తు ఖాయంగా కనిపిస్తున్న సమయంలో విజయవాడ లోక్ సభ నుంచి నాని పోటీ చేయకపోతే..ప్రత్యామ్నాయల పైన టీడీపీ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం.

ఎంపీ సీటు రేసులో
ఇందులో ఆకస్మికంగా విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేరు తెర మీదకు వచ్చింది. లగడపాటి విజయవాడ నుంచి రెండు సార్లు ఎంపీగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటాననే ప్రకటనతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014లో చంద్రబాబు సీఎం అయిన తరువాత పలు సందర్భాల్లో ఆయనతో భేటీ అయ్యారు. 2019 ఎన్నికల సమయంలో లగడపాటి సర్వే అంచనాలు ఫెయిల్ అయ్యాయి. ఆ తరువాత పూర్తిగా రాజకీయ వ్యవహారాలకు దూరం అయ్యారు. ఇప్పుడు తిరిగి రాజకీయంగా ఎంట్రీ ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా తిరిగి విజయవాడ ఎంపీగా ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో మరి కొందరి పేర్లు తెర మీదకు వస్తున్నాయి. కేశినేని నాని సోదరుడు చిన్ని పేరు ఇప్పటి వరకు ప్రచారం సాగినా.. తాజాగా కొత్త సమీకరణాలతో నిర్ణయాలు మారిపోతున్నాయని తెలుస్తోంది.
చంద్రబాబు నిర్ణయంపై ఉత్కంఠ
ఇదే సమయంలో పొత్తుల్లో భాగంగా విజయవాడ ఎంపీ సీటు బీజేపీకి ఇవ్వాలనే ప్రతిపాదన పైన చర్చలు జరుగుతన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా విజయవాడ సీటు బీజేపీకి కేటాయిస్తే మాజీ కేంద్ర మంత్రి . .టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదే విధంగా గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన పీవీపీ ఈ మధ్య కాలంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది. జనసేన కూడా ఈ సీటు పైన ఆశలు పెట్టుకుండి. జనసేనకు కేటాయిస్తే ఒక సినీ ప్రముఖుడికి ఛాన్స్ దక్కనుందని ప్రచారం సాగుతోంది. ఈ తాజా సమీకరణాలతో ఇప్పుడు విజయవాడ ఎంపీ సీటు టీడీపీకి కంచుకోటగా ఉన్న సమయంలో మిత్రపక్షాలకు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరిస్తారా అనేది అసలు ప్రశ్న. ఎంపీ అభ్యర్ధిగా చంద్రబాబు ఎవరికి అవకాశం ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications