స్వతంత్ర అభ్యర్థిగా టీడీపీ మాజీ నేత: రేపే నామినేషన్: ఎన్టీఆర్, వైఎస్సార్ ఫొటోలతో..!!
Muddaraboina Venkateswara Rao: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిల్చున్నారు. గురువారం నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన భారీ ర్యాలీని నిర్వహించనున్నారు.
ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ. దీనితో ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ మొదట్లో ప్రచారం జరిగింది కానీ అది వాస్తవ రూపాన్ని దాల్చలేదు.

ఈ ఎన్నికల్లో నూజివీడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారాయన. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారు. ఇందులో ఎన్టీ రామారావు, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటోలను ఆయన వినియోగించుకుంటోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
బీసీలు వెన్నెముకగా చెప్పే తెలుగుదేశం పార్టీ అధినాయకులు కష్టపడి పనిచేసిన అదే సామాజిక వర్గ నాయకులకు వెన్నుపోటు పొడుస్తోన్నారని ఆరోపించారు. పది సంవత్సరాలుగా కష్టపడి పార్టీని బలోపేతం చేసిన తనకు టికెట్ ను నిరాకరించడమే దీనికి నిదర్శనమని అన్నారు.
బడుగు బలహీన వర్గాలకు టీడీపీ అండగా నిలుస్తుందంటూ చంద్రబాబు చెప్పే మాటలన్నీ అవాస్తవాలేనని విమర్శించారు. కోట్లు గుమ్మరించిన బడా బాబులకు టికెట్లు ఇస్తోన్నాడని ధ్వజమెత్తారు. నిజమైన తెలుగుదేశం పార్టీ నాయకులను చందరబాబు వంచిస్తోన్నాడని ఆరోపించారు.
నూజివీడు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తాను నామినేషన్ వేయదలచుకున్నానని ముద్దరబోయిన తెలిపారు. ఈ నేపథ్యంలో తనతో పాటు తన అభిమానులు, కార్యకర్తలను టీడీపీ బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు తాను గానీ తన అభిమానులు గానీ భయపడబోరని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications