మందుబాబులకు ఇక నో టెన్షన్ - మద్యం షాపుల వద్దే 'పర్మిట్'..!!
ఏపీ ఎక్సైజ్ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్త మద్యం పాలసీని అమల్లోకి తెచ్చారు. బ్రాండెడ్ మద్యం తో పాటుగా రూ 99 కే క్వార్టర్ మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇక 2024-25లో రూ.28,842 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ సంవత్సరం రెవిన్యూ లక్ష్యం చేరుకునేందుకు కొత్త ప్రతిపాదనలు సిద్దం చేసింది. సెప్టెంబర్ లో బార్ల పాలసీ ప్రకటించనుంది. ఇక, తాజాగా ఎక్సైజ్ అధికారులు మద్యం దుకాణాల వద్దే పర్మిట్ రూమ్స్ ప్రారంభానికి వీలుగా నిర్ణయం తీసుకున్నారు.
కొత్త మార్గాలు
ఆదాయం రాబట్టుకోవడంపై ఎక్సైజ్ శాఖ దృష్టి పెట్టింది. పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వడం ద్వారా దీన్ని భర్తీ చేసుకోవాలని భావిస్తోంది. సెప్టెంబరు నుంచి మద్యం షాపుల వద్ద పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో అన్ని షాపులకూ ఏడాదికి రూ.5 లక్షలు పర్మిట్ రూమ్ ఫీజుగా ఉండేది. ఇప్పుడు దానిని రెండు కేటగిరీలు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లలోని షాపులకు రూ.7.5 లక్షలు, మిగిలిన షాపులకు రూ.5 లక్షల చొప్పున ఫీజులుగా ప్రతిపాదించారు. రాష్ట్రంలో 3,736 మద్యం షాపులు ఉన్నాయి. వాటికి రూ.5లక్షల చొప్పున పర్మిట్ రూమ్ ఫీజుల రూపంలో రూ.186 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు.

పర్మిట్ రూమ్స్
కార్పొరేషన్లలోని షాపులకు రూ.2.5లక్షలు అదనం కాబట్టి మొత్తంగా పర్మిట్ రూమ్‌ల ఆదాయం రూ.200 కోట్లు దాటుతుంది. ఆగస్టు వరకు బార్ పాలసీకి గడువు ఉన్నందున, కొత్త బార్ పాలసీ తోపాటు పర్మిట్ రూమ్‌లకు అనుమతులు ఇచ్చి, ఆదాయాన్ని భర్తీ చేసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. గతంలో మద్యం పాలసీ పైన అధ్యయనం చేసిన మంత్రివర్గ ఉపసంఘం పర్మిట్ రూమ్‌లకు అనుమతిస్తే షాపులే బార్లుగా మారిపోతాయని అభిప్రాయపడింది. అన్ని బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావడంతో మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయి. కాగా ప్రభుత్వం ధరలు తగ్గించడంతో అమ్మకాలు పెరిగినా రాబడి ఆ స్థాయిలో లేదని చెబుతున్నారు. ఇప్పుడు పర్మిట్ రూమ్స్ కు అనుమతి ఇస్తే పెరిగే ఆదాయం పైన అధికారులు అంచనాకు వచ్చారు.
బార్ పాలసీ పై కసరత్తు
రాష్ట్రంలో కొత్త బార్ పాలసీ పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. సెప్టెంబర్ నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది. రాష్ట్రంలో మొత్తంగా 870 బార్లు ఉండగా.. అందులో 44 ఖాళీగా ఉన్నాయి. అయితే, ప్రభుత్వం మొత్తంగా 870 బార్లకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. 2022లో తెచ్చిన బార్ పాలసీ సమయంలో దరఖాస్తు ఫీజులు రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు మూడు కేటగి రీలుగా పెట్టారు. ఈసారి లైసెన్స్ ఫీజులు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఫీజు తగ్గించి.. ఎక్కవ దరఖాస్తులు వచ్చేలా అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. దీని ద్వారా ఆదాయం పెరుగుతందని భావిస్తున్నారు. ఇక.. మద్యం దుకాణాల్లో పర్మిట్ రూమ్స్ కు అనుమతి పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications