మరణ శాసనం రాసిన ఘాట్ రోడ్డు ఇక గతం..సరికొత్తగా రూపుదిద్దుకుంటున్న హైవే!
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లో చూస్తే.. అబ్బా ఈ రోడ్ ఏముంది. డ్రైవింగ్ అంటే ఇలాంటి ఘాట్ లో చేయాలి అని మురిసిపోయే రైడర్లకు మైండ్ బ్లోయింగ్ న్యూస్ ఇది. దూరం నుంచి అద్భుతంగా కనిపించే ఈ రహదారి గమ్యస్థానానికి మార్గం కాదు. ఇదు యమలోకానికి వెల్కమ్ రోడ్. ఈ ఘాట్ ఎక్కితే చాలు లారీ డ్రైవర్ల దగ్గర నుంచి సొంతంగా కారు డ్రైవ్ చేసే వారికి వరకు 6.6 కిలోమీటర్లు చేతులు వణుకుతూనే ఉంటాయి. మనం ఎంత జాగ్రత్తగా వెళ్లినా సరే ఏదో రూపంలో మృత్యువు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అసలు ఈ ఘాట్ రోడ్ స్టోరీ ఏంటి? ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నా అనుకుంటున్నారా? మీరే చదవండి
బెంగళూరు నుంచి తమిళనాడు వైపు వెళ్లే డ్రైవర్లను, ప్రయాణికులను ఏళ్ల తరబడి వణికించిన ఘాట్ రోడ్డు కథ మారబోతోంది. నిత్యం పదుల సంఖ్యలో ఘోర ప్రమాదాలు, వందలాది ప్రాణాలను బలిగొన్న భయంకరమైన రోడ్డుకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం దొరికింది. రోజుకు వేలాది వాహనాలు తిరిగే ఈ అత్యంత కీలకమైన దారిని పూర్తిగా రీమోడలింగ్ చేస్తున్నారు.

ఏమిటీ తొప్పూర్ ఘాట్? ఎందుకంత ప్రాధాన్యం?
తమిళనాడులోని ధర్మపురి - సేలం జిల్లాల మధ్య ఉన్న తొప్పూర్ ఘాట్.. కేవలం ఒక చిన్న రోడ్డు మార్గం మాత్రమే కాదు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను కలిపే అతి పెద్ద వాణిజ్య దారి. మన దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి NH-44లో ఇది అత్యంత కీలకమైన భాగం. బెంగళూరు నుంచి సేలం, మదురై, తిరుచ్చి, చెన్నైతో పాటు కేరళ వైపు వెళ్లే ప్రైవేట్ బస్సులు, కార్లు, సరుకు రవాణా లారీలు ఈ దారి గుండానే వెళ్లాలి. రోజుకు దాదాపు 60 వేల వాహనాలు, 5 వేలకు పైగా భారీ లారీలు ఈ 6.6 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు మీదుగానే వెళ్తుంటాయి.
అసలు ఇక్కడ ఇన్ని యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి?
తొప్పూర్ ఘాట్ రోడ్డు డిజైన్ లో ఉన్న తీవ్రమైన లోపాలే ప్రమాదాలకు ప్రధాన కారణం. ఇక్కడ కొండ దిగేటప్పుడు డీప్ టర్నింగులు, కిందికి బాగా వంగి ఉండే రోడ్డు ఉంటుంది. భారీ లోడుతో వచ్చే లారీలు, ట్రక్కులు కొండ దిగేటప్పుడు నిరంతరం బ్రేకులు వేయాల్సి వస్తుంది. దీనివల్ల బ్రేక్ డ్రమ్స్ బాగా వేడెక్కి, ఉన్నట్టుండి బ్రేకులు ఫెయిల్ అవుతాయి. స్పీడ్ కంట్రోల్ కాక ముందెళ్లే వాహనాలపైకి దూసుకెళ్లడం, లోయలోకి పడిపోవడం లేదా బోల్తా పడటం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. 2018 నుంచి ఇప్పటివరకు 630కి పైగా ప్రమాదాలు జరగ్గా, సుమారు 80 మందికి పైగా చనిపోయారు. ఒక్కసారి ప్రమాదం జరిగితే గంటల తరబడి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర నరకం చూసేవారు.
రూ.905 కోట్లతో మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
ఈ డెడ్లీ ఘాట్ కు చెక్ పెట్టేందుకు జాతీయ రహదారుల సంస్థ సుమారు రూ.905 కోట్లతో భారీ ప్రాజెక్టును చేపట్టింది. పాత రోడ్డును కాస్త వెడల్పు చేసి సరిపెట్టకుండా, ఇంజనీరింగ్ డిజైన్‌నే పూర్తిగా మార్చేస్తున్నారు. మొత్తం 6.6 కిలోమీటర్ల మార్గంలో ఏకంగా 3.68 కిలోమీటర్ల పొడవునా ఫ్లై ఓవర్ కమ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. దీని కోసం దాదాపు 50 మీటర్ల ఎత్తున్న 83 భారీ కాంక్రీట్ పిల్లర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ప్రమాదకరమైన మలుపులన్నీ మాయమైపోతాయి.
రోడ్డు వాలు తగ్గింపు.. సేఫ్ అండ్ స్మూత్ జర్నీ!
ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మార్పు రోడ్డు వాలును తగ్గించడం. ప్రస్తుతం ఉన్న 5 నుంచి 9 శాతం రోడ్డు కిందికి ఉండే వాలును కేవలం 3 శాతానికి తగ్గిస్తున్నారు. దీనివల్ల భారీ లారీల బ్రేకులపై ఒత్తిడి తగ్గి, సునాయసంగా కొండ దిగడానికి వీలవుతుంది. అలాగే ఈ ఘాట్ రోడ్డును 4 లేన్ల నుంచి 6 లేన్లుగా విస్తరిస్తున్నారు. నల్లమల అడవుల గుండా సాగే ఈ కఠినమైన పనిలో ఇప్పటికే 46 శాతానికి పైగా నిర్మాణాలు పూర్తయ్యాయి.
ట్రాన్స్‌పోర్ట్ రంగానికి పెద్ద ఉపశమనం
సరుకు రవాణా చేసే లారీ డ్రైవర్లకు, ట్రాన్స్‌పోర్ట్ యజమానులకు ఈ ప్రాజెక్ట్ చాలా పెద్ద ఉపశమనం కానుంది. ఘాట్‌లో చిన్న ప్రమాదం జరిగినా 3 నుంచి 5 గంటల సమయం వృథా అయ్యేది. సరఫరాలు నిలిచిపోయి కోట్లలో నష్టం వాటిల్లేది. మార్చి 2028 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయితే.. ప్రమాదాల భయం తప్పుతుంది. అంతేకాకుండా ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఇంధనం కూడా బాగా ఆదా అవుతుందని వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications