జగన్ సర్కార్ పై మరోసారి ఆనం సంచలన వ్యాఖ్యలు...
ఏపీలో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం విభేదించడం మొదలుపెట్టి, చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసి పార్టీ నుంచి సస్పెండైన ఆనం రామనారాయణరెడ్డి.. మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్దితుల్ని, అధికారం, వాలంటీర్ల వ్యవస్ధ, అప్పులు వంటి అంశాలపై ఆనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇంతకీ ఆనం ఏమన్నారో తెలుసా..
రాష్ట్రంలో ప్రస్తుతం దౌర్భాగ్యపు పరిపాలన సాగుతోందని, దీన్ని అంతం చేయడానికి అందరూ నడుం బిగించాలని ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. రాష్ట్రంలో కేవలం ముగ్గురి చేతుల్లోనే పాలన సాగుతోందన్నారు. సీఎం, కలెక్టర్, వాలంటీర్ల ఆధ్వర్యంలోనే పాలన సాగుతోందని ఆనం వెల్లడించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ సభ్యులకు ఎలాంటి అధికారాలు లేవన్నారు.

రాష్ట్రంలో తాజాగా వాలంటీర్ల వ్యవస్ధను సైతం నిర్వీర్యం చేసి పార్టీ పరంగా పనిచేసే గృహసారధుల వ్యవస్ధను తీసుకొచ్చారని ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. వారికే సర్వాధికారాలు కట్టబెట్టారన్నారు. అసెంబ్లీ సమావేశాలు కూడా గతంలో 70 రోజులు జరిగేవని, కానీ ఇప్పుడు 20 రోజులు జరగడమే కష్టంగా ఉందన్నారు. క్యాంపు కార్యాలయాల్లోనే అన్నీ జరిగిపోతున్నాయని ఆనం తెలిపారు.
రాష్ట్రంలో అభివృద్ధిపై స్పందిస్తూ.. సోమశిల హైలెవల్ కాలువ తొలిదశ పూర్తికాకుండానే రెండోదశను ఎవరి కోసం చేపట్టారని ఆనం ప్రశ్నించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న చీప్ లిక్కర్లో విష పదార్ధాలున్నాయని, దానికి అలవాటు పడిన వ్యక్తుల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారని ఆనం విమర్శించారు. రాష్ట్రానికి లక్షల కోట్లు అప్పు తెస్తున్నారని, కానీ రూపాయి ఆస్తి అయినా పెరిగిందా అని ప్రశ్నించారు. రెండేళ్ల క్రితం తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టుును ఏమీ చేయలేదని, కనీసం నిర్వాసిత కుటుంబాలకు ఇళ్లు కూడా కట్టించలేదని ఆనం ఆరోపించారు.












Click it and Unblock the Notifications