చంద్రబాబు అలా చేసి ఉంటే రాయలసీమకు నీరు వచ్చేది: పురంధేశ్వరి
చిత్తూరు: పట్టిసీమకు పెట్టే ఖర్చు పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేస్తే రాయలసీమకు నీరు వచ్చి ఉండేదని నారా చంద్రబాబు నాయుడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బిజెపి నేత దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. శుక్రవారం ఆమె చిత్తూరు జిల్లాలోపర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు పోలవరాన్ని అంకితభావంతో త్వరగా పూర్తి చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆమె అన్నారు. రాయలసీమలో రైతుల ఆత్మహత్యలు బాధాకరమని పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యేక హోదా కోసం పాకులాడకుండా ప్రత్యేక ప్యాకేజీతో ఏపీని అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పురందేశ్వరి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం కచ్చితంగా ఆదుకుంటుందని ఆమె చెప్పారు. హంద్రీనీవాను అభివృద్ధి చేస్తే రాయలసీమకు నీరు వస్తుందని పురంధేశ్వరి చెప్పారు.
రాయలసీమకు పట్టిసీమ నుంచి నీరు ఇవ్వడం సందేహమేనని ఆమె అన్నారు. రాయలసీమ దాహార్తిని తీర్చేవి హంద్రీనీవా, గాలేరు నగరి మాత్రమేనని ఆమె చెప్పారు. కేంద్రం చేపట్టిన పథకాలు పార్టీకి పేరు తేవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications