పవన్ పర్యటనలో ఆ ఫేక్ ఐపీఎస్ ఎవరో తెలిసింది, అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో కలకలం సృష్టించిన ఫేక్ ఐపీఎస్ అధికారి కేసులో పురుగోతి సాధించారు. డిసెంబర్ 20వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం బాగుజోలులో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ పర్యటనలో ఫేక్ ఐపీఎస్ అధికారి పాల్గొనడం సంచలనంగా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఫేక్ ఐపీఎస్ అధికారిగా కనిపించిన బలివాడ సూర్య ప్రకాశ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కేసు వివరాలను ఏఎస్పీ దిలీప్ కిరణ్ శనివారం మీడియాకు వెల్లడించారు. యూనిఫాంలో ట్రైనీ ఐపీఎస్ పేరుతో 41 ఏళ్ల బలివాడ సూర్యప్రకాశ్ వచ్చారు. పార్కింగ్ ప్లేస్ వద్ద అతడ్ని నిలిపివేశామని, అయితే, కొంచెం దూరం నడిచివెళ్లి పార్కింగ్ ప్లేస్ దగ్గరకు మళ్లీ వచ్చాడని తెలిపారు.

పవన్ కళ్యాణ్ వ్యూపాయింట్‌కు వెళ్లాక శంకుస్థాపన స్థలం వద్దకు వెళ్లి.. ఫొటోలు తీసుకుని వాట్సప్ స్టేటస్‌లో పెట్టుకున్నాడని చెప్పారు. కొంత మందికి అనుమానం వచ్చి తమకు ఫిర్యాదు చేశారని.. వెంటనే నకిలీ ఐపీఎస్‌ను అదుపులోకి తీసుకున్నామని ఏఎస్పీ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
డిప్యటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యక్రమం పూర్తయ్యాక వెళ్లి సూర్యప్రకాశ్ ఫొటోలు దిగాడని.. అయితే, పవన్ ఉన్నప్పుడు మాత్రం ఆయన దగ్గరకు వెళ్లలేదని చెప్పారు. దత్తిరాజేరులో సూర్యప్రకాశ్ తండ్రి 9 ఎకరాల పొలం కొన్నాడని తెలిపారు. కాగితాలు రాసుకున్నారు కానీ.. రిజిస్ట్రేషన్ చేసుకోలేదని.. ఆ భూమిని సొంతం చేసుకునేందుకు పోలీసు అధికారి అవతారం ఎత్తాడని చెప్పారు. నిందితుడి నుంచి కారు, ఐడీ కార్డులు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ వివరించారు.
మరోవైపు, నకిలీ ఐపీఎస్ అధికారి వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. నకిలీ ఐపీఎస్ ఎలా వచ్చాడనేది ఉన్నతాధికారులు చూసుకోవాలని, ఆ బాధ్యత ఇంటెలిజెన్స్, డీజీపీ, హోంమంత్రిదేనని అన్నారు. తనకు పని చేయడం ఒక్కటే తెలుసని.. తన భద్రత బాధ్యతలు చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు పెద్దలదేనని పేర్కొన్నారు. ఈ అంశంపై తన పేషీ అధికారులు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారని, ఈ విషయంపై తాను కూడా డీజీపీతో మాట్లాడతానని పవన్ తెలిపారు.












Click it and Unblock the Notifications