బెజవాడలో కల్తీ మద్యం: 6 గురు మృతి, బాధితులంతా కూలీలే!
విజయవాడ: నవ్యాంధ్ర నూతన రాజధానిగా ప్రస్తుతం వెలుగొందుతున్న విజయవాడలో కల్తీ మద్యం కోరలు చాచింది. నగరంలోని కృష్ణలంక కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హోటల్ స్వర్ణ బార్‌లో కల్తీ మద్యం తాగి ఆరుగురు మృతి చెందగా, 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వారిని ఆసుపత్రికి తరలించేలోగానే ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ సంఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన వారిని విజయవాడలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. అస్వస్థతకు గురైన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

కల్తీ మద్యం సరఫరా చేసి నలుగురి మృతికి కారణమైన విజయవాడలోని స్వర్ణ బార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు చెందినదని బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వ లైసెన్స్ షాపుల్లోనే నకిలీ మద్యం అమ్ముతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ సిబ్బంది బార్‌పై దాడి చేసి మద్యం శాంపిళ్లను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. ఇటీవలే విజయవాడలో కల్తీ నెయ్యిని తయారు చేస్తున్న ముఠాను పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. తాజాగా ఇప్పుడు కల్తీమద్యం నగర వాసుల్లో భయాందోళనకు గురిచేస్తోంది.
కల్తీ మద్యం ఘటనపై ఆగ్రహించిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్తీమద్యం ఘటనపై సమాచారం అందిన వెంటనే బార్‌కు చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గద్దె రామ్మోహన్ రావు స్థానిక మీడియాతో మాట్లాడుతూ సదరు బార్ మల్లాది విష్ణుకు చెందినదిగా చెప్పారు.
ఈ ఘటనకు బార్‌లో సరఫరా చేసిన మద్యం, లేదంటే అక్కడి నీరే కారణమై ఉంటుందని ఆయన తెలిపారు. ఎక్సైజ్ అధికారుల విచారణలో ఈ ఘటనకు గల కారణాలు వెలుగులోకి వస్తాయన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
కాగా ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖమంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మరోవైపు మృతుల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications