యువతికి వేధింపు: ఫోన్ చేసి పిలుపు, పోకిరీలకు దేహశుద్ధి
హైదరాబాద్: రాజధానిలో ఈవ్ టీజర్లకు దేహశుద్ధి చేశారు. హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో శుక్రవారం కొందరు యువకులు రెచ్చిపోయారు. ఇద్దరు యువతులను వేధింపులకు గురి చేశారు. దీంతో ఆ యువతులు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.
ఆమె ఫోన్ చేయగానే అక్కడకు చేరుకున్న యువతి బంధువులు పోకిరీలకు బుద్ధి చెప్పారు. వారిని నిలదీశారు. దీంతో పోకిరీలు ఎదురు తిరిగారు. దీంతో వారు యువకులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మరో ఆరుగురు పారిపోయారు.
ఫేకర్ పరిశ్రమలో ఉద్రిక్తత

విజయనగరం జిల్లా గరివిడి ఫేకర్ పరిశ్రమలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పది నెలలు లాకౌట్ అనంతరం పరిశ్రమ శుక్రవారం తిరిగి ప్రారంభమైంది. అయితే, ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగులను పనిలోకి తీసుకోవడంతో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.
రాజమండ్రి గ్రామీణ ఎమ్మెల్యే డ్రైవర్ అనుమానాస్పద మృతి
రాజమండ్రి గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న శివ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బొబ్బర్లంక వంతెన వద్ద శివ మృతదేహం కనిపించింది. రాత్రి కొందరు యువకులతో అతను ఘర్షణ పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
'బహిరంగ ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు వద్దు'
బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల డీజీపీలు, ఎస్పీలు, కలెక్టర్లు, మున్సిపల్ అధికారులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications