పెద్దిరెడ్డి గుర్తు పెట్టుకో, తిరుబాటు చేస్తే ఇలాగే ఉంటుంది, మా కడుపులు కొట్టావు గుర్తుందా ?
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను పుంగనూరులో అడుగుపెట్టనివ్వమని, గత ఐదు సంవత్సరాలు నియంతగా మా మీద పెత్తనం చెలాయించిన పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు మా సత్తా చూపిస్తామని, వందల ఎకరాల మా భూములు బలవంతంగా లాక్కొని ఇంత వరకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని, ఇక ముందు మీ పెత్తనం అడ్డుకుంటామని బాధితులు పెద్దిరెడ్డిని హెచ్చరించారు.
పుంగనూరు పట్టణంలో శుక్రవారం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుంగనూరులోని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో జలాశయాల భూ నిర్వాసితులు టీడీపీ నాయకులను వెంటపెట్టుకుని మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి దగ్గరకు వెళ్లారు. ఇంటి లోపల ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని బయటకురావాలని జలాశయాల భూ నిర్వాసితులు నినాదాలు చేశారు.

మాకు పరిహారం ఎప్పుడు ఇస్తారో చెప్పాలని, ఇంతకాలం మా కడుపులు కొట్టి మీ కడుపులు నింపుకున్నారని, ఇక మీ పెత్తనం మేము సహించలేమని భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఆ సందర్బంలో సమాచారం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి దగ్గరకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఆ సమయంలో మాటామటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడికి దిగడంతో 14 మందికి గాయాలు అయ్యాయి.
రాళ్ల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలు సురేష్, వివేక్,అజీమ్, నూర్ బాషా, మోహన్ నాయుడు, అష్రఫ్, సల్మాన్, ప్రసాద్, షామీర, సయ్యద్ తదితరులతో పాటు పుంగనూరు కానిస్టేబుల్ క్రిస్ణమూర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రగాయాలైన అఫ్రఫ్ ను తిరుపతికి తరలించడంతో అతను అక్కడ చికిత్స పొందుతున్నాడు. మిగిలిన వారికి చిన్నచిన్న గాయాలు అయ్యాయని పోలీసులు అంటున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పుంగనూరులో అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు.
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా పుంగనూరు రావడం వలనే ఇలాంటి గొడవలు జరిగాయని పోలీసు అధికారులు అంటున్నారు. తాను ఈ ప్రాంతానికి ఎంపీ అని, తన నియోజక వర్గంలో పర్యటించానికి కూడా అవకాశం లేకుండా కూటమి ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి మా మీద దాడులు చేయిస్తోందని, వైసీపీ నాయకుల ఆస్తులు ద్వంసం చేస్తున్నారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు.

జూన్ 15వ తేదీన మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పుంగనూరులో పర్యటించడానికి సిద్దం అయ్యారు. ఆ సమయంలో పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో పెద్దిరెడ్డి ఆయన పర్యటనను వాయిదా వేసుకున్నారు. జూన్ 30వ తేదీన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుంగనూరు రావడానికి ప్రయత్నిస్తే ఆ రోజు కూడా టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తరువాత మిథున్ రెడ్డి పుంగనూరుకు రాకుండా మదనపల్లెకు వెళ్లారు.
ఇప్పుడు బయటకు సమాచారం ఇవ్వకుండా మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి రావడంతో మిథున్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైయ్యింది. పెద్దిరెడ్డి కుటుంబం పుంగనూరులో ఉంటే అరాచకాలు ఎక్కువ అవుతాయని, అందుకే వాళ్లు ఇక్కడికి రాకుండా అడ్డుకుంటామని పుంగనూరు టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పుంగనూరులో అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. జలాశయాలు నిర్మించడానికి పెద్దిరెడ్డికి చెందిన సొంత సంస్థ రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కొని వారికి పరిహారం చెల్లించలేదని రైతులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications