ఎపి రాజధానికి రాయపూడి రైతుల సెగ

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూసేకరణ అంత సులభంగా కానిపించడం లేదు. భూసేకరణపై రైతుల అభిప్రాయలను తెలుసుకోవడానికి వచ్చిన మంత్రుల కమిటీకి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. గుంటూరు జిల్లా తాళ్లూరు మండలం రాయపూడి గ్రామ ప్రజలు రాజధానికి భూములు ఇవ్వడానికి నిరాకరించారు. తాము రాజధానికి కూరగాయలు సరఫరా చేస్తామని వారు చెబుతున్నారు.
వర్షం లేకుండా తమ వద్ద కూరగాయలు పండుతాయని, దాదాపు 150 రకాల కూరగాయలను తాము పండిస్తామని, తాము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని వారు చెప్పారు. భూసేకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణకు కూడా శ్రీకారం చుట్టారు. భూములు వదులుకునేది లేదని చెప్పారు.
తుళ్లూరు మండలం రాయపూడిలో రాజధాని భూముల సేకరణపై శనివారం జరిగిన అభిప్రాయ సేకరణ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అభిప్రాయ సేకరణలో తమకు మాట్లాడడానికి ఎందుకు సమయం ఇవ్వరని కొందరు రైతులు తాడికొండ శాసనసభ్యుడు శ్రావణ్ కుమార్‌ను ప్రశ్నించారు. వారితో ఎమ్మెల్యే వాగ్వానికి దిగారు.
మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు శనివారం రాయపూడిలో పర్యటించారు. ఈ సందర్భంగా తమ భూములు ఇవ్వబోమంటూ రైతులు నినాదాలు చేశారు. సమావేశంలో గలాటా సృష్టించవద్దని, మాట్లాడేందుకు అందరికీ అవకాశం ఇస్తామని శ్రావణ్ కుమార్ రైతులకు చెప్పారు. అయినా రైతులు వినకుండా నినాదాలు చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications