కరణం, గొట్టిపాటి వర్గీయలు ఘర్షణ: మంత్రి సమక్షంలో బుచ్చయ్య చౌదరిపై దాడికి యత్నం
అమరావతి: ఒంగోలులో టీడీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తిరుపతిలో జరిగే మహానాడుకు సన్నాహాకంగా అద్దంకి నియోజకవర్గ ఇంఛార్జి కరణం వెంకటేశ్ నేతృత్వంలో ఒంగోలులో చేపట్టిన మిని మహానాడు రసాభాసగా మారింది. కరణం బలరాం, గొట్టిపాటి రవి వర్గీయలు పోటాపోటీ నినాదాలు చేయడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. టీడీపీలో ఎంతో కాలంగా ఉంటున్న కరణం బలరాం... వైసీపీ టికెట్‌పై గెలిచి టీడీపీలో చేరిన గొట్టిపాటి రవి చేరికను మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే చంద్రబాబు కరణం బలరాంను విజయవాడకు పిలిచి సర్ది చెప్పిన సంగతి తెలిసిందే.
తాజాగా శనివారం ఒంగోలులో తెలుగుదేశం పార్టీ మిని మహానాడు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన కరణం బలరాం వర్గీయులు ముందుగా జై బలరాం అంటూ నినాదాలు చేశారు. మరోవైపు ఈ నినాదాలకు పోటీగా గొట్టిపాటి అనుచరులు కూడా తామేమీ తక్కువ తినలేదని పోటాపోటీ నినాదాలు చేస్తూ బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

దీంతో పోలీసులు కలగజేసుకుని నినాదాలు చేస్తున్న వారిని అడ్డుకుని బయటకు పంపించేశారు. గొట్టిపాటి రవి వర్గాన్ని టీడీపీలో చేర్చుకోవడాన్ని ఆది నుంచి కూడా బలరాం వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే హోదా ఉన్న రవి వర్గం కూడా తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఈ ఘర్షణ మొత్తం కూడా మంత్రి రావెల కిశోర్ బాబు సమక్షంలో జరగడం విశేషం. కాగా, ఇరు వర్గాల మధ్య ఘర్షణ మరింత పెద్దది కాకుండా చూడాలన్న ఉద్దేశంతో, అక్కడే ఉన్న పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇరు వర్గాల మధ్యకు వెళ్లి వారించేందుకు ప్రయత్నించగా, కరణం బలరాం ఆయనతో వాగ్వాదానికి దిగారు.
"నీవల్లే రవి టీడీపీలోకి వచ్చాడు"అని బలరాం గట్టిగా అనడంతో, ఆయన వర్గీయులు బుచ్చయ్యపైనా దాడికి యత్నించారని సమాచారం. ఈ ఘర్షణకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications