పరవాడ సెజ్‌లో అగ్నిప్రమాదం- బెంబేలెత్తుతున్న ఉమ్మడి విశాఖ
Paravada Pharma SEZ: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురంలో గల ఫార్మా సెజ్‌లో సంభవించిన భారీ పేలుడు మిగిల్చిన విషాదం నుంచి కోలుకోకముందే మరో దుర్ఘటన సంభవించింది. ఈ వరుస ప్రమాదాలు ఉమ్మడి విశాఖపట్నంవాసులను బెంబేలెత్తిస్తోన్నాయి. భయాందోళనలక గురి చేస్తోన్నాయి.
తాజాగా- పరవాడ ఫార్మా సెజ్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తోన్న సినర్జీస్ యాక్టివ్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు.

అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో పరవాడలో గల జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా స్పెషల్ ఎకనమిక్ జోన్‌లో ఈ ప్రమాదం జరిగింది. సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రేడియంట్స్ సంస్థలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన విశాఖపట్నం ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు.
ఈ నలుగురు కూడా జార్ఖండ్‌కు చెందిన వాళ్లుగా గుర్తించారు. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో గల రియాక్టర్ పేలుడు ఘటన సంభవించి 48 గంటలు కూడా గడవకముందే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వరుస ప్రమాదాలు తలెత్తుతోండటంతో ఉమ్మడి విశాఖపట్నంవాసులు ఆందోళనకు గురవుతున్నారు.
అచ్యుతాపురం పేలుడు ఘటనలో 17 మంది మరణించిన విషయం తెలిసిందే. 50 మందికిపైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఉన్న ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో బుధవారం మధ్యాహ్నం ఈ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.
ఏడుమందికి పైగా కార్మికులు సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రం అయ్యాయి. చెల్లాచెదురు అయ్యాయి. పేలుడు ధాటికి ఈ కంపెనీ కప్పు పైభాగం కింద పడటం వల్ల పలువురు కార్మికులు దాని కింద చిక్కుకున్నారు.
ఈ దుర్ఘటనపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇచ్చారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. రియాక్టర్ పేలుడు ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications