
ఆ గ్రామంపై ఈగలదాడి.. ఈగ సినిమా సీన్ రిపీట్; ఈగల దండయాత్ర వెనుక పెద్దకథే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామంలో ప్రజలు వింత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ గ్రామ ప్రజలపై ఈగలు కక్ష కట్టాయి. ఒకటి కాదు రెండు కాదు లక్షల సంఖ్యలో ఈగలు ఆ గ్రామం పైకి దండయాత్ర చేస్తున్నాయి. గ్రామంపై పడి ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. రాజమౌళి సినిమాలో ఈగ లాగా, గ్రామస్తులను ఈగలు ముప్పతిప్పలు పెడుతున్నాయి.
వరదలపై చంద్రబాబు బురద రాజకీయాలు; వారడిగితే పడవప్రమాదంపై విచారణ: మంత్రి తానేటి వనిత

చిత్తూరు జిల్లా నగరే పల్లిపై ఈగల దాడి
రాజమౌళి సినిమాలో ఈగ విలన్ ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తే, చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం, నగరే పల్లి గ్రామంలో లక్షల సంఖ్యలో దాడి చేస్తున్న ఈగలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈగలమోతలో మేము ఉండలేము మహాప్రభో అంటూ ప్రజలు అధికారులకు చెప్పుకుంటున్నారు అంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లక్షల కొద్దీ ఈగలు గ్రామాన్ని చుట్టుముట్టి దండయాత్ర చేస్తూ ప్రజలను ఏ పని చేసుకోనివ్వడం లేదు.

ఈగల వల్ల కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదు అంటున్న గ్రామస్తులు
గ్రామాలలో ప్రజలు ఇష్టమైనవి వండుకొని కనీసం కడుపునిండా తినే పరిస్థితి కూడా లేకుండా ఈగలు వాటిపై వాలుతున్నాయి. గ్రామంలో ఏదైనా శుభకార్యం చేసుకోవాలన్నా, వేడుక చేసుకోవాలన్న ప్రజలు ఈగల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం నిద్రపోయే సమయంలో కూడా వదలకుండా మీద వాలుతూ ఈగలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా, చివరకు పొలం పనులకు వెళ్లినా ఈగల బెడద మాత్రం తప్పడం లేదు. ఎక్కడ చూసినా ముసురుతున్న ఈగలతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.

ఈగల వ్యాప్తితో అనారోగ్యం బారిన పడుతున్న గ్రామస్తులు
ఇక ఈ గ్రామంలో నివాసం ఉంటున్న 150 మంది రైతులు, కూలీల కుటుంబాలు మమ్మల్ని ఈగల బెడద నుండి కాపాడండి అంటూ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామానికి ఎవరు వెళ్ళినా ఈగల బెడద గురించి చెబుతూ లబోదిబోమంటున్నారు. ఇక ఎక్కడపడితే అక్కడ ముసురుతున్న ఈగలతో గ్రామస్తులు అనారోగ్యం బారిన పడుతున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అనారోగ్యం బారిన పడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈగల వల్లే ఈ బాధలు అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈగల బెడద ఎక్కువ కావటానికి కారణం ఇవే .. గ్రామస్తుల ఆరోపణ
అయితే గ్రామంలో ఈగల బెడద ఎక్కువ కావడానికి, గ్రామానికి సమీపంలో ఉన్న కోళ్లఫారాలు కారణమని గ్రామస్తులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కోళ్ల ఫారాల నుండి వచ్చే వ్యర్థాల కారణంగా ఈగల వ్యాప్తి అధికం అయిందని వారు చెప్తున్నారు. గ్రామానికి సమీపంలో ఉన్న కోళ్ల ఫారాల యజమానులకు అనేకసార్లు తమ అవస్థలను చెప్పుకున్న పట్టించుకున్న దాఖలాలు లేవని గ్రామస్థులు వాపోతున్నారు. ఇక వారు సైతం ఈగలు రాకుండా ఏం చెయ్యాలో అర్ధం కాక సతమతం అవుతున్నారు.

ఈగల బెదడపై అధికారులకు ఫిర్యాదు.. కాపాడాలని వేడుకోలు
ఇక ఈగల బెడద తట్టుకోలేక తమ పరిస్థితిని అధికారులకు ఫిర్యాదు చేసిన, ఇదెక్కడి ఈగల గోలా అనుకుంటూ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అధికారులతో పరిస్థితిని అర్థం చేసుకొని ఈగల నుండి తమను రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈగల బెడద కారణంగా తమ గ్రామ ప్రజలు అనారోగ్యం బారిన పడి ప్రాణాలు మీదకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని, చాలామంది ఈగల కారణంగా గ్రామాన్ని విడిచి వెళ్లే పరిస్థితి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.