విజయవాడ- తిరుపతి విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..! కొత్త సర్వీసులు-షెడ్యూల్ ఇదే..!
ఏపీ రాజధాని అమరావతిలో భాగమైన విజయవాడ నుంచి తిరుపతి వెళ్లే విమాన ప్రయాణికులకు, భక్తులకు గుడ్ న్యూస్. ఈ రెండు నగరాల మధ్య కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అట్టహాసంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఫ్లై 91 (Fly91) సంస్థ వీటిని (Tirupati-Vijayawada Flights) ప్రారంభించింది. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై తొలి విమాన టికెట్లు బుక్ చేసుకున్న కుటుంబానికి బోర్డింగ్ పాస్‌లను ఇచ్చారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.
తిరుపతి నుంచి విజయవాడకు వచ్చిన తొలి విమానానికి విజయవాడ విమానాశ్రయంలో సంప్రదాయ వాటర్ కేనన్ సెల్యూట్‌తో స్వాగతం పలికారు. తొలిరోజే ఈ మార్గానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించింది. 68 సీట్ల సామర్థ్యం ఉన్న విమానంలో విజయవాడ నుంచి 64 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఈ కొత్త విమాన కనెక్టివిటీతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ముఖ్యంగా తిరుమల శ్రీవాణి దర్శనం టికెట్లను పొందేందుకు ఈ సర్వీసు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

విజయవాడ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తే కృష్ణా, గోదావరి జిల్లాల పరిధిలోని ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు. విజయవాడ నుంచి అంతర్జాతీయ విమాన కనెక్టివిటీని మరింత విస్తరించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిని కోరారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా తిరుపతి-విజయవాడ మార్గంలో సర్వీసులు ప్రారంభించిన ఫ్లై91కు అభినందనలు తెలిపారు. ఫ్లై91 విమాన షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఇందులో భాగంగా IC-3511 తిరుపతి → విజయవాడ విమానం ఉదయం 8:05కబయలుదేరి ఉదయం 9:15కి గమ్యానికి చేరుకుంటుంది. అలాగే IC-3512 విజయవాడ → తిరుపతి విమానం ఉదయం 9:45కు బయలుదేరి 10:50కు గమ్యానికి చేరుకుంటుంది. ఈ విమాన సర్వీసులు మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం నాలుగు రోజులు నడుస్తాయి.














Click it and Unblock the Notifications
