అక్కడ వైసీపీకి సవాల్ విసరబోతున్న కాంగ్రెస్..! రాష్ట్రంలో ఇదే తొలిసారి..
ఏపీలో రాష్ట్ర విభజన తర్వాత దానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయింది. 2014లో జరిగిన విభజన తర్వాత అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలతో మొదలుపెడితే ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఉనికి చాటుకోలేకపోయింది. ఈసారి ఎన్నికల్లో తొలిసారి వైఎస్ షర్మిల నేతృత్వంలో బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ ఏదో అద్భుతాలు చేస్తుందన్న అంచనాలు ఏమాత్రం లేవు. అయితే ఓ సీటులో మాత్రం వైసీపీకి గట్టి పోటీ ఇచ్చి బోణీ కొట్టేలా కనిపిస్తోంది.
రాష్ట్రంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి, వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా కొనసాగుతున్న కడప లోక్ సభ సీటులో ఈసారి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీకి సిద్దమవుతున్నారు. ఇప్పటికే ఓసారి ఇదే సీటులో ఎంపీగా గెలిచిన వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. దీనికి ప్రధాన కారణం వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై జరుగుతున్న చర్చే.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగుతుండటంతో ఆయన కుమార్తె సునీతారెడ్డి దీనిపై తీవ్ర అసహనంగా ఉన్నారు. అదే సమయంలో సునీతకు మొదటి నుంచీ వైఎస్ షర్మిల గట్టి మద్దతుదారుగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా షర్మిల కడప లోక్ సభ సీటులో పోటీకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో సునీతారెడ్డితో పాటు ఆమెకు జిల్లాలో మద్దతుగా నిలుస్తున్న ఇతర పార్టీల నేతలు కూడా షర్మిల గెలుపుకు తోడ్పడేందుకు సిద్దమవుతున్నారు. అదే జరిగితే ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఏపీ నుంచి కాంగ్రెస్ బోణీ కొట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు. అలాగే రాష్ట్ర విభజన తర్వాత వైసీపీపై తొలిసారి గెలిచి భవిష్యత్తు రాజకీయాలకు కాంగ్రెస్ బాటలు పరుచుకునే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications