బీజేపీ నిరనసల్లో తొలిసారి జనసేన-ఒంగోలులో అరుదైన సీన్..!
ఏపీలో నాలుగేళ్లుగా పొత్తులో ఉన్నప్పటికీ ఉమ్మడిగా నిరసనలు చేయడం లేదని, కార్యక్రమాలు నిర్వహించడం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ-జనసేన పార్టీలు తొలిసారి ఓ వేదికపై దర్శనమిచ్చాయి. చాలా కాలం తర్వాత బీజేపీ-జనసేన కార్యకర్తలు, నేతలు ఒక్క చోటకు చేరి వైసీపీ ప్రభుత్వంపై సమరసంఖం పూరించాయి. ఒంగోలులో సర్పంచ్ ల విషయంలో వైసీపీ సర్కార్ వ్యవహారశైలిని నిరసిస్తూ బీజేపీ చేపట్టిన ధర్నా ఇందుకు వేదికైంది.
ఏపీలో 2019 ఎన్నికల ముందు వరకూ కలిసే ఉన్న బీజేపీ-జనసేన ఎన్నికల సమయంలో మాత్రం విడిపోయాయి. అలాగే విడిగా పోటీ చేసి నష్టపోయాయి. ఎన్నికల తర్వాత తిరిగి కలిశాయి. అయితే పేరుకు పొత్తే కానీ ఎక్కడా ఇరు పార్టీల నేతలు కలిసి ఏ కార్యక్రమాల్లోనూ కలిసి కనిపించే వారు కాదు. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు లేదని, విడిపోయారని పలు ఊహాగానాలు వినిపించేవి. ఇంకా చెప్పాలంటే టీడీపీ కోసం జనసేన బీజేపీని వదిలేసిందనే ప్రచారం కూడా విస్తృతంగా సాగింది. కానీ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్దితుల నేపథ్యంలో ఇవాళ ఇరు పార్టీల నేతలు ఒక్క చోట దర్శనమిచ్చారు.

వైసీపీ సర్కార్ రాష్ట్రంలోని పంచాయతీల్లో సర్పంచ్ లకు ఇవ్వాల్సిన నిధుల్ని దారి మళ్లించి ఇతరత్రా కార్యక్రమాలకు వాడుకుంటోందని విపక్షాలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాయి. ఇదే అంశంపై రాష్ట్రంలో వైసీపీ సర్పంచ్ లు కూడా విపక్ష సర్పంచ్ లతో కలిసి నిరసనలు చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోనూ సర్పంచ్ లంతా ఏకతాటిపైకి వచ్చి నిరసన గళం వినిపించారు. ఇప్పుడు అదే అంశంపై రాష్ట్రంలో బీజేపీ ఇవాళ ఒంగోలులో ధర్నా చేపట్టింది. దీనికి మిత్రపక్షం జనసేనను కూడా ఆహ్వనించింది.

బీజేపీ ఆహ్వానంతో జనసేన నేతలు కూడా ఒంగోలు ధర్నాలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఇప్పటికే పోరాడుతున్న ఇరు పార్టీల నేతలు..ధర్నాలో ఉత్సాహంగా పాల్గొని సర్పంచ్ లకు సంఘీభావం ప్రకటించారు. సర్పంచ్ లకు హక్కులు, నిధులు కల్పించే వరకూ పోరాటం కొనసాగిస్తామని ధర్నాలో పాల్గొన్న నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచాలని ఇరు పార్టీల నేతలు పిలుపునిచ్చారు. చాలా కాలం తర్వాత బీజేపీ-జనసేన నేతలు కలిసి దర్శనం ఇవ్వడంతో క్యాడర్ లోనూ ఉత్సాహం కనిపించింది.












Click it and Unblock the Notifications