
జగన్ కు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ ! సుప్రీంకోర్టు వేదికగా- లైన్ క్లియర్ అయినట్లేనా?
ఏపీ, తెలంగాణ విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య పలు పెండింగ్ సమస్యలు ఉన్నాయి. విభజన తర్వాత కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే కొనసాగుతోంది. అయినా సమస్యల పరిష్కారం మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలో బీజేపీ దూకుడు నేపథ్యంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్ధాపించి ఇతర రాష్ట్రాల్లోనూ ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో నిన్న సుప్రీంకోర్టులో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.

తెలుగు రాష్ట్రాల వివాదాలు
2014లో తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత తలెత్తిన సమస్యల పరిష్కారానికి కేంద్రం చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే రాజకీయ కారణాలను సాకుగా చూపుతూ కేంద్రం పలు సమస్యల విషయంలో మొహం చాటేస్తోంది. అలాగే కొన్ని విషయాల్లో తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది.
దీంతో సాఫీగా సాగిపోవాల్సిన విభజన ప్రక్రియ కాస్తా ఇప్పటికీ సమస్యగా కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై ఓవైపు వివాదాలు నడుస్తుండగానే.. మరో కీలక అంశంలో వివాదానికి తెరపడేలా కనిపిస్తోంది.

పోలవరంపై తెలంగాణ అభ్యంతరాలు
విభజన తర్వాత ఏపీకి జీవనాడిగా మారిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తెలంగాణ పలు అభ్యంతరాలు చెబుతూ వచ్చింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వందలాది గ్రామాల్ని ఈ ప్రాజెక్టు ముంచేస్తుందని, తెలంగాణ అభ్యంతరాల భయంతోనే పోలవరంలో ఏడు మండలాల్ని ఏపీలో కలిపేసి కేంద్రం అన్యాయం చేసిందని ఇన్నాళ్లూ కేసీఆర్ సర్కార్ వాదిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ విషయంలో పట్టు విడుపులు ప్రదర్శించేందుకు తెలంగాణ సిద్దమైనట్లు కనిపిస్తోంది. నిన్న సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా తెలంగాణ తన అభిప్రాయాన్ని చెప్పేసింది.

పోలవరానికి తెలంగాణ ఓకే
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో గతంలో లేవనెత్తిన అభ్యంతరాలను పక్కనబెట్టి సమస్య పరిష్కారం కోసం తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రాజెక్టు నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని సుప్రీంకోర్టుకు తెలంగాణ తరఫు న్యాయవాది తెలిపారు. అయితే రక్షణ గోడలు నిర్మించడం ద్వారా ముంపు లేకుండా చూడాలని ఆయన కోరారు. గతంలో అంచనా వేసిన వరద ప్రవాహం 38 వేల క్యూసెక్కులతో పోలిస్తే ఇప్పుడు 50 క్యూసెక్కులకు ఇది పెరిగిందన్నారు. కాబట్టి ముంపు లేకుండా చూస్తే చాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్ ఘడ్ మాత్రం ఇంకా పట్టు వీడలేదు.

జగన్ కు లైన్ క్లియర్?
పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా, ఛత్తీస్ ఘడ్ వంటి పొరుగు రాష్ట్రాలతో కలిపి తెలంగాణ కూడా ఇప్పటివరకూ అభ్యంతరాలు చెబుతూ వచ్చింది. తమ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాను ముంచేస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం వద్దంటూ నినదించింది. అయితే ఇప్పుడు మాత్రం రక్షణ గోడలు నిర్మించి ముంపు లేకుండా చేయాలని కోరుతోంది. ప్రాజెక్టు నిర్మాణానికి అభ్యంతరాలు లేవంటోంది. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఆ మేరకు ఊరట లభించబోతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో నేరుగా ప్రభావితమయ్యే రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నుంచి ఆ మేరకు మద్దతు లభించడంతో ఇక ఒడిశా, ఛత్తీస్ ఘడ్ ను ఒప్పించేందుకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తే సరిపోతుంది.