Chandrababu Arrest : గవర్నర్ అనుమతి ఉండాల్సిందే-సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరర్రావు
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో పాత్రపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు ఈ ఉదయం నంద్యాలలో అరెస్టు చేశారు. ఆయన్ను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చేందుకు నంద్యాల నుంచి విజయవాడకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టుపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. దీంతో సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఢిల్లీలో దీనిపై స్పందించారు.
విపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేసిన విధానం అక్రమమని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. ఇది చట్ట విరుద్ధం కూడా అన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం, దర్యాప్తు చేపట్టడం కుదరదన్నారు.రాష్ట్రంలో అవినీతి నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు చేపట్టడానికి గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి అని నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు అవినీతి నిరోధక చట్టంలోని 17ఎ(సి) సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరి అన్నారు.

చంద్రబాబు అరెస్టు విషయంలో గవర్నర్ అనుమతి తీసుకున్నారా లేదా అన్న విషయంలో స్పష్టత కరువైందని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. ఒకవేళ గవర్నర్ అనుమతి తీసుకుని ఉంటే ఆ పత్రాలు తమకు ఇవ్వాలని దర్యాప్తు అధికారులను చంద్రబాబు డిమాండ్ చేయాలన్నారు. గవర్నర్ అనుమతి తీసుకోకపోయినా, ఇవ్వకపోయినా మొత్తం దర్యాప్తు చెల్లుబాటు కాదని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
ఇవాళ గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును నంద్యాలలో అదుపులోకి తీసుకుంటే అది అక్రమ నిర్భంధమే అవుతుందని నాగేశ్వరరావు పేర్కొన్నారు. అక్రమ నిర్భంధానికి పాల్పడిన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని కూడా ఆయన హెచ్చరించారు. దీంతో చంద్రబాబు అరెస్ట్ విషయంలో సీఐడీ అధికారులు అనుమతి తీసుకున్నారా లేదా అనే అంశంపై చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications