జగన్ పాలనపై ప్రశంసల జల్లు కురిపించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ !!
చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత జనసేన టిడిపి పొత్తు ప్రకటించడం, ప్రస్తుతం ఏపీలో పోటాపోటీగా బస్సు యాత్రలు చేయడం చక చకా జరిగిపోతున్నాయి. ఇక ఇదే సమయంలో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యవహార శైలి కూడా ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా సిబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనను కొనియాడారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సిబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన లక్ష్మీనారాయణ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించారు. పేద ప్రజలకు మంచిని చేకూర్చేలా సీఎం జగన్మోహన్ రెడ్డి పథకాలు ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు.ఆరోగ్య సురక్ష కార్యక్రమం, నాడు నేడు పథకాలు, పిల్లలకు రాగి జావ అందించడం, మధ్యాహ్నం భోజనాన్ని అందించడం బాగున్నాయని ఆయన తెలిపారు.
విద్య వైద్య రంగాలలో మంచి చేసిన వారికి మంచి ఫలితం ఉంటుందని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఇక తాను చదువుకున్న స్కూల్ గతానికి ఇప్పటికీ ఎంతో మారిందని, తాము చదువుకున్న స్కూల్లో ప్రస్తుతం పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నారని లక్ష్మీనారాయణ వెల్లడించారు.
జగనన్న ఆరోగ్య సురక్ష గురించి మాట్లాడిన ఆయన సాధారణంగా ఎప్పుడైనా ఒక రోజు క్యాంపు పెట్టి ఒకరోజుతోనే ముగిస్తారని, కానీ ఈ క్యాంపును ఇన్ని రోజులపాటు కొనసాగించి, వైద్యులు నేరుగా మీ వద్దకు వచ్చి, మీ ఆరోగ్యాన్ని పరీక్షించి, కావలసిన పరీక్షలు చేసి, ఆరు నెలలు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని అందరూ అభినందించాలని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
తాజాగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి. జగన్మోహన్ రెడ్డిని పొగిడిన తీరు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications