జగన్ ది అహం- తన కేసుల కంటే రఘురామదే సీరియస్-తగ్గితే గెలుపు-ఉండవల్లి కామెంట్స్
ఏపీలో వైసీపీ వర్సెస్ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుగా సాగిపోతున్న పోరాటం రోజురోజుకూ ముదురుతోంది. ఈ నేపథ్యంలో జగన్ వర్సెస్ రఘురామరాజుగా ఈ పోరు మారడానికి గల కారణాలు, ఈ పోరుతో జగన్ ఎదుర్కోబోయే ఇబ్బందులు, గతంలో ఇలాంటి సందర్భాల్లో జగన్ తండ్రి వైఎస్ ఏం చేశారన్న అంశాలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జగన్ బెయిల్ రద్దు వ్యవహారంలో ఏం జరగబోతుందో కూడా ఉండవల్లి తనదైన శైలిలో చెప్పేశారు.

జగన్-రఘురామ పోరుపై ఉండవల్లి కామెంట్స్
ఏపీలో సీఎం జగన్ వర్సెస్ రఘురామరాజుగా సాగుతున్న పోరుపై కాంగ్రెస్ మాజీ ఎంపీ, ఒకప్పటి వైఎస్సార్ సన్నిహితుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్-రఘురామ పోరుకు కారణాలు చెప్తూనే .. పరిష్కారాన్ని సైతం ఆయన సూచించారు. అంతటితో ఆగకుండా జగన్ బెయిల్ రద్దుకు సంబంధించి ఏం జరగబోతోందో కూడా ఉండవల్లి వెల్లడించారు. గతంలో జస్టిస్ రమణతో పోరు ప్రభావం జగన్ బెయిల్ రద్దుపై ఉంటుందా లేదా అనే అంశంపై కూడా ఉండవల్లి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

జగన్ అహంభావంతోనే రఘురామ పోరు
మహా భారతంలో దుర్యోధనుడు పారిపోయి నీటిలో దాక్కున్నప్పుడు.. నిన్నేమీ చేయమని మాలో ఒకరితో పోరాడితే చాలని ధర్మరాజు అంటాడని,. కానీ భీముడితోనే పోరాడతానని దుర్యోధనుడు అనడం అహంభావమేనని ఉండవల్లి స్పష్టం చేశారు. అదే దుర్యోధనుడుకి నష్టం తెచ్చిందన్నారు. ఇప్పుడు జగన్ అహం కూడా అలాగే ఉందన్నారు. కేవలం ఓ ఎంపీ అయిన రఘురామపై సీఎం, పార్టీ అధ్యక్షుడు అయిన జగన్ పోరుకు ఇదే అసలు కారణమన్నారు. గతంలో తనపై యూపీఏ సర్కార్ సీబీఐ కేసులు పెట్టిస్తే సోనియాగాంధీని వదిలి సీబీఐ జాయింట్ డైరెక్టర్ అయిన లక్ష్మీనారాయణను టార్గెట్ చేయడం కూడా జగన్ ఇగోకు నిదర్శమన్నారు.

జగన్ కోసం జేడీ లక్షీనారాయణ వద్దకు రఘురామ
గతంలో తనపై సీబీఐ కేసులు పెట్టినప్పుడు జగన్.. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ వద్దకు రఘురామకృష్ణంరాజును పంపారని, ఆ తర్వాత ఆయన బీజేపీ, టీడీపీకి వెళ్లి తిరిగి వైసీపీలోకి వస్తే ఎంపీగా టికెట్ ఇచ్చింది కూడా జగనేనని ఉండవల్లి తెలిపారు. జగన్ సిఫార్సు లేకుండా రఘురామ పార్లమెంటరీ కమీటీల పదవులు పొందే వారా అని ఉండవల్లి ప్రశ్నించారు. జగన్ తనకు అండగా నిలిచిన, తాను సిఫార్సు చేసిన రఘురామతో పోరు కోరుకోవడం మంచిది కాదన్నారు.

జగన్ కేసుల కంటే రఘురామ కేసే సీరియస్
జగన్ పై నమోదైన సీబీఐ కేసుల కంటే రఘురామకృష్ణంరాజుపై ఏపీ సీఐడీ దాడి చేసే సీరియస్ కేసు అని న్యాయనిపుణుడు కూడా అయిన ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఓ ఎంపీపై దాడి చేయించడం ద్వారా జగన్ తప్పుచేశారన్నారు. రఘురామపై దాడి కేసు త్వరలో పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీకి వెళ్తుందన్నారు. అప్పుడు పార్లమెంటులో పెద్ద గొడవ జరగడం ఖాయమన్నారు. అదే జరిగితే కచ్చితంగా ఈ కేసు జగన్ కేసుల కంటే పెద్దదిగా మారి జగన్ కు ఇబ్బందులు సృష్టిస్తుందని ఉండవల్లి జోస్యం చెప్పారు. ఒక ఎంపీని కొట్డడం తానెప్పుడూ చూడలేదుని, ఇది జగన్ అహంభావమేనని ఉండవల్లి అన్నారు. దీనివల్ల జగన్ పక్కన ఉండేవాళ్లే శత్రువులయ్యే అవకాశాలు ఉంటాయన్నారు.

జగన్ స్ధానంలో వైఎస్సార్ ఉంటే
జగన్ స్ధానంలో వైఎస్సార్ ఉంటే మాత్రం రఘురామరాజు వివాదాన్ని ఇలా డీల్ చేసే వారు కాదన్నారు. చాలా సింపుల్ గా ఈ వ్యవహారాన్ని వైఎస్ పరిష్కరించే వారని ఉండవల్లి గుర్తు చేసుకున్నారు. గతంలో ఢిల్లీ ఆంధ్రాభవన్ వద్ద కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేస్తున్నప్పుడు వైఎస్ ఓ ఆంధ్రాభవన్ ఉద్యోగిని కొట్టారని, కానీ ఆ వివాదం పెద్దదై మీడియా ఫోకస్ అటు వెళ్లే సరికి, తిరిగి సదరు ఉద్యోగిని కౌగిలించుకుని ఆ వివాదానికి చాలా సింపుల్ గా ఫుల్ స్టాప్ పెట్టారని ఉండవల్లి గుర్తు చేశారు. కానీ రఘురామ గురించి పూర్తిగా తెలిసిన జగన్ మాత్రం అలా చేయడం లేదన్నారు.
Recommended Video

రఘరామ వివాదంలో తగ్గితే జగన్ దే గెలుపు
ఎప్పుడైనా ఓ చిన్నవాడికీ, పెద్దవాడికీ తగవు వచ్చినప్పుడు పెద్దవాడు తగ్గాలని ఉండవల్లి తెలిపారు. సీఎంకూ, ఓ ఎంపీకి తగవు వచ్చినప్పుడు సీఎం తగ్గాల్సిందేనన్నారు. రఘురామ ఎలాంటి వాడో జగన్ కు తెలుసని, ఈజీగా సెటిల్ అయిపోయే కేసు ఇది అని ఉండవల్లి తెలిపారు. జగన్, రఘురామ కేసులో ఎవరు తగ్గితే వారిదే గెలుపు అని ఉండవల్లి విశ్లేషించారు.
జగన్-రఘురామ వివాదానికి ఎక్కడో చోట ఓ కాంప్రమైజ్ ఉండాలని ఉండవల్లి తెలిపారు. కాంప్రమైజ్ కాకపోతే జగన్ చుట్టూనే శత్రువులు తయారవుతారని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications