ఏబీ వెంకటేశ్వరరావుకు కీలక పదవి ఇచ్చిన చంద్రబాబు-ఉత్తర్వులు జారీ..!
ఏపీలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కీలక పదవి దక్కింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు సస్పెండ్ కావడంతో పాటు పలు ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా న్యాయం జరగలేదని చర్చ జరుగుతున్న తరుణంలో కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.


ఏపీ పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ గా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం ఇవాళ జీవో జారీ చేసింది. ఆయన బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి రెండేళ్ల పాటు పదవిలో ఉండేలా హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ జీవో జారీ చేశారు. ఆయన పదవికి సంబంధించిన నియమ నిబంధనలను త్వరలో విడుదల చేస్తామని హోంశాఖ ఇవాళ జారీ చేసిన జీవోలో పేర్కొంది.
డీజీపీ ర్యాంకు అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావు 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కీలక పదవులు నిర్వహించారు. చివరిగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా నియమితులయ్యారు. సీఎం చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరున్న ఆయనకు రాష్ట్రంలో టీడీపీ స్ధానంలో 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో కష్టాలు మొదలయ్యాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిఘా పరికరాల కొనుగోలుకు ప్రయత్నించారనే ఆరోపణలతో జగన్ సర్కార్ అప్పట్లో ఏబీని సస్పెండ్ చేసింది. దీనిపై కోర్టులకు వెళ్లి పోరాటం చేసి ఊరట పొందినా.. ప్రభుత్వంపై ప్రెస్ మీట్ పెట్టి అఖిల భారత సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారంటూ మరసారి సస్పెండ్ చేసింది. దీనిపై సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ఏబీ విజయం సాధించారు.
తాజాగా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనకు కీలక పదవి దక్కుతుందని భావించినా ఆరు నెలలుగా వెయిటింగ్ తప్పలేదు. ఈ లోపు ప్రభుత్వం ఆయనపై గతంలో నమోదు చేసిన అభియోగాల్ని ఉపసంహరించుకోవడంతో పాటు సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరించింది. దీంతో ఆ కాలంలో జీతభత్యాల బకాయిలు వచ్చాయి. ఇప్పుడు పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పదవి ఏబీకి దక్కింది.












Click it and Unblock the Notifications