అంబటి రాంబాబు సవాల్..!!
Ambati Rambabu: శాసన మండలి సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉండటం, ఆ పార్టీ సభ్యులు సభకు హాజరవుతోండటం దీనికి ప్రధాన కారణం. రాష్ట్రంలో శాంతిభద్రతలు, మహిళలపై అఘాయిత్యాలు మొదలుకుని అధికార తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్సీపీ సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది.
మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యుల తీరుపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించారంటూ ఆరోపించారు. నిండు సభలో తన తల్లిని అవమానించినందు వల్లే చంద్రబాబు సభను బహిష్కరించారని, ముఖ్యమంత్రి అయ్యాకే సభలో అడుగు పెడతానంటూ ప్రతిజ్ఞ చేశారని గుర్తు చేశారు.

గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు శాసన సభకు హాజరుకాకపోవడం పట్ల మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు దుష్ప్రచారం చేస్తోన్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు సభకు రాకుండా పారిపోయారని వైసీపీ సభ్యులు చెప్పడం ఏ మాత్రం సరైంది కాదని, అసెంబ్లీలో తన తల్లిని అవమానించిన తరువాత ఆయన సభను బాయ్‌కాట్ చేశారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.
2022 వరకు చంద్రబాబు ప్రతి రోజూ సభకు వచ్చారని, సింహంలా నిలబడ్డారని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తన తల్లిని ఎవరైతే అవమానించారో వారికి టికెట్లు ఇచ్చారంటూ ఆయన విమర్శించారు. అలాంటి వారిని బొత్స సత్యనారాయణ ఎందుకు సమర్థిస్తున్నారని నిలదీశారు.
వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు మహిళలు అంటే చిన్న చూపని, షర్మిల, విజయమ్మను కూడా కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని, అలాంటి వారిని అరెస్ట్ చేయడం సమర్థనీయమేనని నారా లోకేష్ తేల్చి చెప్పారు. జగన్ కుటుంబం గురించి తాము ఏనాడూ మాట్లాడలేదని అన్నారు.
మండలిలో పరోక్షంగా తన ప్రస్తావనను తీసుకుని రావడం పట్ల వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. చంద్రబాబు, నారా లోకేష్‌కు సవాల్ విసిరారు. నారా భువనేశ్వరిని అవమానించినట్లు నిరూపించితే రాజకీయాలకు గుడ్‌బై చెబుతానని తేల్చి చెప్పారు.
శాసనసభలో మీ తల్లిగారిని అవమానించినట్లు నిరూపిస్తే.. బేషరతుగా క్షమాపణలు చెబుతానని అంబటి రాంబాబు అన్నారు. అంతేకాకుండా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ఓ పోస్ట్ పెట్టారు. దీన్ని నారా లోకేష్‌కు ట్యాగ్ చేశారు.
శాసనసభలో మీ తల్లిగారిని అవమానించినట్లు నిరూపిస్తే !
— Ambati Rambabu (@AmbatiRambabu) November 15, 2024
బేషరతుగా క్షమాపణ చెప్పి
రాజకీయ నిష్క్రమణ చేస్తాను !@naralokesh
అలాగే- స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపైనా విమర్శలు గుప్పించారు అంబటి. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసులు పెడితే ముందుగా ప్రస్తుత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పైన పెట్టాలి, అరెస్టు చేయాలి.. అని మరో ట్వీట్‌ను పోస్ట్ చేశారు.
అనుచిత వ్యాఖ్యలు చేశారని
— Ambati Rambabu (@AmbatiRambabu) November 15, 2024
కేసులు పెడితే ముందుగా
ప్రస్తుత స్పీకర్ పైనా డిప్యూటీ స్పీకర్ పైన
పెట్టాలి అరెస్టు చేయాలి! @AyyannaPatruduC @KRaghuRaju












Click it and Unblock the Notifications