జగన్ మార్కాపురం టూర్ లో ప్రోటోకాల్ వివాదం- హర్ట్ అయి ఒంగోలు వెళ్లిపోయిన బాలినేని
ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి, ఇప్పుడు వైసీపీ సమన్వయ కర్తగా ఉన్న ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇవాళ అవమానం ఎదురైంది. జిల్లాలోని మార్కాపురంలో ఈబీసీ నేస్తం పథకం ప్రారంభోత్సవానికి వస్తున్న సీఎం జగన్ ను హెలిప్యాడ్ వద్ద రిసీవ్ చేసుకునేందుకు కారులో వెళ్తున్న బాలినేనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హర్ట్ అయిన ఆయన.. తిరిగి ఒంగోలు వెళ్లిపోయారు.
సీఎం జగన్ మార్కాపురంలో హెలికాఫ్టర్ దిగగానే ఆయన వద్దకు వెళ్లి స్వాగతం పలకాలని భావించిన బాలినేని శ్రీనివాసరెడ్డి నేరుగా కారులోనే హెలిప్యాడ్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ప్రోటోకాల్ ఉన్న వారిని మాత్రమే హెలిప్యాడ్ వద్దకు అనుమతిస్తున్నట్లు ఆయనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ బాలినేని మాత్రం వినలేదు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సీఎం జగన్ మార్కాపురంలో సభకు వస్తున్న నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు మాజీ మంత్రి బాలినేని, ఒంగోలు మేయర్ సుజాత, మరికొందరు బాలినేని అనుచరులు కూడా అక్కడికి వచ్చారు. అయితే ప్రోటోకాల్ వివాదం నేపథ్యంలో బాలినేని కాసేపు పోలీసులతో వాగ్వాదం అనంతరం ఒంగోలు బయలుదేరారు. ఆయనతో పాటు అనుచరులు, ఒంగోలు మేయర్ కూడా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications