గుడివాడలో చిత్తుగా ఓడిన కొడాలి నాని-టీడీపీ అభ్యర్ధి రాముకి భారీ మెజార్టీ..!
వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఇవాళ ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చిత్తుగా ఓటమి పాలయ్యారు. గత 20 ఏళ్లుగా గుడివాడను అప్రతిహతంగా పాలిస్తున్న కొడాలి నానికి ఈసారి ఓటర్లు భారీ షాకిచ్చారు. తొలిసారి ఆయనపై బరిలోకి దిగిన టీడీపీ ఎన్నారై అభ్యర్ధి వెనిగండ్ల రామును ఏకంగా 51 వేల భారీ మెజార్టీతో గెలిపించారు. దీంతో కొడాలి నాని పరాజయం ఖాయమైంది. విషయం తెలిసిన కొడాలి నాని కౌంటింగ్ ప్రారంభం కాగానే ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
గుడివాళ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత నాలుగు ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వచ్చిన కొడాలి నాని వైసీపీ ప్రభుత్వ హయాంలో తన సామాజిక వర్గానికి చెందిన విపక్ష నేత చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్, మరో విపక్ష పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు చిరంజీవిపై పలు సందర్భాలో రెచ్చిపోయారు. చంద్రబాబు, లోకేష్ పై అయితే దారుణమైన బూతులతో విరుచుకుపడ్డారు. జనాభిప్రాయంతో సంబంధం లేకుండా వైఎస్ జగన్ ను మెప్పించేందుకు పదే పదే నోటికి పని చెప్పేవారు.

అదే సమయంలో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా పనిచేసినా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడం, టిడ్కో ఇళ్ల పేరుతో చేసిన మోసం, తనను ఇన్నాళ్లుగా మద్దతుగా ఉన్న సామాజిక వర్గాల్ని పట్టించుకోకపోవడం, చంద్రబాబు-పవన్ పొత్తు కారణంగా మారిన రాజకీయ పరిస్ధితులు కొడాలి భారీ ఓటమికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త అభ్యర్ధి వెనిగండ్ల రాముకు జనం భారీ మద్దతుతో గెలిపించారు.












Click it and Unblock the Notifications