టీడీపీ-జనసేనకు కొణతాల కీలక సలహా-టికెట్లకు ముందే ఆ ప్రకటన..!
ఏపీలో అధికార వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన టీడీపీ జనసేన కూటమి టికెట్ల ప్రకటనతో పాటు ఉమ్మడి మ్యానిఫెస్టో దిశగా కసరత్తు జరుపుతోంది. అయితే ఓ కీలక అంశంపై మాత్రం ఇరు పార్టీల మధ్య ఎక్కడా చర్చ జరగడం లేదు. దీంతో త్వరలో జనసేన తీర్ధం పుచ్చుకోబోతున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఇరు పార్టీలకు ఓ కీలక సూచన చేశారు. టికెట్ల ప్రకటనకు ముందే ఈ కీలక అంశంపై ప్రకటన చేయాలని ఆయన సూచించారు.
టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపకాలపై ఇప్పటివరకూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు జరిగాయి. త్వరలో సీట్ల ప్రకటన చేసేందుకు ఇరువురు నేతలు సిద్ధమవుతున్నారు. అయితే ఇరు పార్టీల పొత్తు సజావుగా సాగేందుకు వీలుగా టీడీపీ, జనసేన ఉమ్మడి కనీస కార్యక్రమం రూపొందించుకుని ఓ ప్రకటన చేయాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సలహా ఇచ్చారు. దీన్ని ప్రకటించి ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాతే సీట్ల ప్రకటన ఉండాలని ఆయన సూచించారు.

అలాగే క్షేత్రస్ధాయిలో ఇరు పార్టీల మధ్య సమన్వయం కోసం కొణతాల రామకృష్ణ మరో సలహా కూడా ఇచ్చారు. నియోజకవర్గాల స్ధాయిలో టీడీపీ జనసేన మధ్య సమన్వయం కోసం స్టీరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి సూచించారు. ఇందులో ఇరు పార్టీల నేతలు ఉండాలన్నారు. అలాగే అన్ని స్ధాయిలో సమన్వయం కోసం ప్రత్యేక కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. తద్వారా ఇరు పార్టీల మధ్య గ్యాప్ రాకుండా చూసుకోవాలని కొణతాల రామకృష్ణ తెలిపారు.












Click it and Unblock the Notifications