కోడికత్తి దర్యాప్తుపై భుజాలు తడుముకోవడం ఎందుకు: పేర్ని నాని
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్నినాని ఘాటు విమర్శలు సంధించారు. కోడికత్తి కేసులో ఒక వర్గానికి చెందిన మీడియలో వస్తోన్న కథనాలను ఆయన తప్పుపట్టారు. దర్యాప్తును పక్కదారి పట్టించేలా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో కోడికత్తి కేసుపై రోజుకో కథనం వెలువడుతోందని మండిపడ్డారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని విలేకరులతో మాట్లాడారు. గతంలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో జరిగిన హత్యాయత్నంపై ఓ దినపత్రికలో వచ్చిన కథనం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. సానుభూతి కోసం వైఎస్ జగన్ తన మీద తానే హత్యాయత్నం చేయించుకున్నాడంటూ అందులో పొందుపర్చడాన్ని తప్పుపట్టారు.

అదే నిజమైతే- 2003లో తిరుపతిలో చంద్రబాబు కూడా తన మీద తానే బాంబు పేల్చుకున్నాడా? అని పేర్ని నాని ప్రశ్నించారు. అప్పుడు చంద్రబాబు మీద జరిగింది హత్యాయత్నమే అయితే- వైఎస్ జగన్‌పై జరిగింది కూడా హత్యాయత్నమే అవుతుందని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సానుభూతి కోసమే చంద్రబాబు తిరుపతిలో తనపై బాంబు దాడి చేయించుకున్నట్లు తాము భావించవచ్చా? అని ప్రశ్నించారు.
జగన్‌పై సానుభూతి రావాలనే కారణంతోనే తాను హత్యాయత్నం చేసినట్లు కోడికత్తి శీను పేరిట ఆ కథనాన్ని ప్రచురించడం పట్ల పేర్ని నాని పలు అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్‌పై హత్యాయత్నం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న వ్యక్తి ఇప్పుడు రామోజీ రావుకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడా? అని ప్రశ్నించారు. జగన్ మీద హత్యాయత్నం జరిగిన గంటలోనే డీజీపీ వచ్చి ఈ కేసులో కుట్రలేదని ఎలా చెప్పగలిగాడని అన్నారు.
జగన్‌ను ఏదో రకంగా అపఖ్యాతిపాలు చేయాలనే ఉద్దేశంతో ఎల్లో మీడియా పని చేస్తోందని, ఇది కొత్తేమీ కాదని పేర్ని నాని పేర్కొన్నారు. అత్యంత భద్రతతో కూడుకున్న ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో ప్రతిపక్ష నేత ఉన్న సమయంలో కోడికత్తి ఎలా వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేయాలని తాము డిమాండ్ చేస్తే చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎల్లో మీడియా భుజాలు ఎందుకు తడుముకుంటోన్నాయని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications