అక్కడ లోడెత్తే ఆయన ఉండటం వల్లే నాలుగేళ్లు పట్టింది: పేర్ని నాని
మచిలీపట్నం: మచిలీపట్నం పోర్ట్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. దీని నిర్మాణ పనులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. మొత్తంగా ఈ పోర్ట్ నిర్మాణ వ్యయం 11,464 కోట్ల రూపాయలు. తొలి దశలో 5,156 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
పోర్ట్ నిర్మాణ పనులను ప్రారంభించిన సందర్భంగా వైఎస్ జగన్.. తపసిపూడి వద్ద సముద్రుడికి ప్రత్యేక పూజలు చేశారు. హారతి ఇచ్చారు. గంగమ్మకు పూజలు చేశారు. పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం తపసిపూడి తీరంలో బ్రేక్ వాటర్ పనులను జెండా ఊపి ప్రారంభించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆరంభమైన నాలుగో పోర్ట్ నిర్మాణ పనులు ఇవి. రామాయపట్నం, కాకినాడ సెజ్ పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

మూలాపేట పోర్టు నిర్మాణ పనులకు వైఎస్ జగన్ ఇటీవలే శంకుస్థాపన చేశారు. ఇక తాజాగా మచిలీపట్నం ఓడరేవు పనులకు శ్రీకారం చుట్టారు. పర్యాటకం, పరిశ్రలమ శాఖ మంత్రులు ఆర్ కే రోజా, గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మాణ పనులను వైఎస్ జగన్ స్వయంగా పర్యవేక్షించారు. అక్కడే ఏర్పాటు చేసిన మచిలీపట్నం పోర్ట్ నమూనాను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా పోర్ట్ కోసం ఎదురు చూస్తోన్నామని, ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో ఆ కల సాకారమౌతోందని అన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓడరేవుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ ఆయన కుమారుడు వైఎస్ జగన్ ఆ బాధ్యతలను స్వీకరించారని అన్నారు.

బందరు పోర్ట్ నిర్మాణానికి అడ్డుకున్నది ఎవరో అందరికీ తెలిసిన విషయమేనని పేర్ని నాని అన్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు సినిమాలోని డైలాగ్‌ను ప్రస్తావించారు. మహేష్ బాబు సినిమాలో ఒకాయన లోడెత్తాల్రా చెక్‌పోస్ట్‌కు టైమ్ అవుతోంది.. అనే డైలాగ్ చెబుతుంటాడని, అలాంటాయన ఉండటం వల్లే బందరు పోర్ట్ నిర్మాణ పనుల్లో జాప్యం ఏర్పడిందని చెప్పారు.
నక్కజిత్తుల చంద్రబాబుకు ఎక్కడ బలం ఉందో మనకు తెలుసు కదా? అంటూ పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబుకు జనంలో ఏ మాత్రం బలం లేదని, లోడెత్తే ఆయన ఇంటికి వెళ్తే గానీ మచిలీపట్నం పోర్ట్‌కు కోర్టుల నుంచి అనుమతులు లభించట్లేదని పేర్కొన్నారు. ఇన్నాళ్లకు ఓడరేవుకు మోక్షం లభించిందని, చంద్రబాబు తన బలాన్ని ఒక్కటొక్కటిగా కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications