వాలంటీర్ల వ్యవస్ధ రద్దు చేస్తారా ? పవన్ కు పేర్నినాని సవాల్ ! ఓర్వలేకే విష ప్రచారం..!
ఏపీలో సంక్షేమ పథకాల లబ్దిదారుల నుంచి వాలంటీర్లు సేకరిస్తున్న డేటాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పవన్ వ్యాఖ్యలపై మండిపడుతున్న వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇవాళ మూకుమ్మడి దాడికి దిగారు. పవన్ వ్యాఖ్యల్ని తప్పుబడుతూ వరుస కౌంటర్లు వేస్తున్నారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్నినాని కూడా ఘాటుగా స్పందించారు.
వాలంటీర్ల వ్యవస్ధ అంటే పవన్, చంద్రబాబుకు భయం పట్టుకుందని, జగన్ సంక్షేమ పాలనను వీరిద్దరూ ఓర్వలేకపోతున్నారని వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని ఆరోపించారు. పేద, బలహీన వర్గాలకు ఎంతో సేవ చేస్తున్న వాలంటీర్ల వ్యవస్ధతో సీఎం జగన్ కు మంచి పేరు రావడాన్నీ వీరిద్దరూ తట్టుకోలేకపోతున్నారని పేర్ని విమర్శించారు. అబద్దాలు చెప్పనంటూనే పవన్ అబద్దాలు చెప్తున్నారని, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

వాలంటీర్ల వ్యవస్ధపై పవన్ వ్యాఖ్యల నేపథ్యంలో పేర్నినాని ఆయనకు ఓ సవాల్ విసిరారు. అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్ధను రద్దు చేస్తారా అని సవాల్ చేసారు. అలా మీ మ్యానిఫెస్టోలో పెట్టండని సూచించారు. వాలంటీర్లలో ఎక్కువగా ఉన్న మహిళల్ని పవన్ కించపరుస్తున్నారని పేర్ని విమర్శించారు. పవన్ .. చంద్రబాబు ఇచ్చిన స్కిప్ట్ చదువుతూ వైసీపీపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. పవన్ కు విజ్ఞత ఉంటే వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు.

పవన్ ను మీరు మాట్లాడేది ప్రవచనాలా అని పేర్ని ప్రశ్నించారు. మీకే ఆత్మగౌరవం ఉంటుందా , వాలంటీర్లకు ఉండదా అని అడిగారు. పేదల కోసం పనిచేస్తున్న వాలంటీర్ల ఆత్మగౌరవాన్ని పవన్ కించపరుస్తున్నారని పేర్నినాని విమర్శించారు. కొల్లేరుపై పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, టీడీపీ హయాంలో ఏం చేశారో తెలుసుకోవాలని పవన్ కు పేర్ని సూచించారు. టీడీపీ హయాంలో కొల్లేరు ఎండిపోయిందని, జగన్ వచ్చాక ఎప్పుడైనా ఎండిపోయిందా అని పేర్ని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications