'180 కోట్లతో అవసరమా, రాజధానికోసం నారాయణ బిల్డింగ్ త్యాగం చేయలేరా'
గుంటూరు: రాష్ట్రం ఆర్థిక లోటులో ఉందంటూనే తాత్కాలిక సచివాలయానికి రూ.180 కోట్లు వెచ్చించడం అవసరమా అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు బుధవారం చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఓ వైపు రాజధాని నిర్మాణానికి విద్యార్థుల నుంచి చందాలు వస్తూలు చేస్తున్న ప్రభుత్వం తాత్కాలిక నిర్మాణాల పేరిటో రూ.వేలు, వందల కోట్ల ఖర్చు సరికాదన్నారు. ప్రజా రాజధాని నిర్మిస్తామంటే రైతులు 33వేల ఎకరాల భూములు త్యాగం చేశారన్నారు.
తాత్కాలిక కార్యాలయాల కోసం మంత్రి నారాయణ భవనాలు త్యాగం చేయలేరా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆకాశంలో విహరిస్తోందని, నేలమీదకు వచ్చి ప్రజలకు పాలన అందించాలని హితవు పలికారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం కోసం ఒత్తిడి చేయాలన్నారు.

మాస్టర్ ప్లాన్‌లో వ్యవసాయ పరిరక్షణ జోన్ నిబంధనలు తక్షణమే మార్పు చేయాలన్నారు. వ్యవసాయం, పంటల పైన ప్రేమతో అగ్రికల్చరల్ జోన్‌లు ఏర్పాటు చేయలేదని.. రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెంచుకునేందుకేనని ఆరోపించారు.
మాస్టర్ ప్లాన్ పైన అభ్యంతరాలు కోరుతూ రైతులకు అర్థం కాకుండా నోటిఫికేషన్ ఇంగ్లీషులో విడుదల చేయడం ఏమిటన్నారు. తెలుగులో దానిని విడుదల చేసి రైతుల అభిప్రాయాలు, సూచనలు తీసుకోవాలన్నారు. ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి వందల ఎకరాల భూమి, వేల కోట్ల నిధులు ఖర్చు చేయడం తగదన్నారు.












Click it and Unblock the Notifications