చంద్రబాబుకు షాక్.. సోషల్ మీడియాలో రోజా సంచలన పోస్ట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి వైసిపి సోషల్ మీడియా పెడుతున్న పోస్టుల పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు అనుచిత పోస్టులు చేస్తున్న వారి పైన కేసులు పెట్టి అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే.
సోషల్ మీడియా పోస్టులపై రోజా సంచలన వ్యాఖ్యలు
ఇక ఈ క్రమంలో తాజాగా వైసిపి సోషల్ మీడియాకు అండగా ఉండడం కోసం వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారికి కావలసిన మద్దతు అందిస్తామని కూడా ప్రకటించారు. ఇక ఇదే సమయంలో మాజీ మంత్రి వైసిపి నాయకురాలు రోజా ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

సోషల్ మీడియా పోస్టులు పెడుతూనే ఉంటాం
ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తూనే ఉంటామని మాజీ మంత్రి రోజా స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ఆమె నిలదీశారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రోజా ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మాటేంటి?
మహిళలకు 1500రూపాయలు, విద్యార్థులకు 15000రూపాయలు, రైతులకు 20వేల రూపాయలు, యువతకు 3000 రూపాయలు ఇవ్వకుండా మోసం చేశారని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడతామని ఆమె బల్లగుద్ది మరీ చెప్పారు.
ఆడబిడ్డ నిధి పేరుతో 18ఏళ్ల నిండిన ప్రతి మహిళకు 1500రూపాయలు చొప్పున ఏడాదికి 18000 ఇవ్వాలని కానీ ఎంత ఇచ్చారని ప్రశ్నించారు.
ఇప్పటివరకు ఈ పథకాల్లో చేసిందేంటి?
దీపం పథకంతో ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని దాని కోసం ఎంత కేటాయించారో చెప్పాలన్నారు. తల్లికి వందనం పథకంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఏడాదికి 15000 రూపాయలు ఇస్తామన్నారని, ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని రోజా ప్రశ్నించారు. ఇక అన్నదాత పథకంలో ఏడాదికి 20,000 చొప్పున ప్రతి రైతుకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారని ఇప్పటివరకు ఎంత ఇచ్చారో చెప్పాలన్నారు.
మహిళలకు ఉచిత బస్సు, యువ గళం పథకంపై నిలదీత
ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఏడాదికి దాదాపు 3 వేల కోట్లు ఖర్చు చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తామన్నారని ఇప్పటివరకు ఎందుకు అందించలేదో చెప్పాలన్నారు. యువగళం పథకంతో రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు 3000 ఇస్తామన్నారని, ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని, ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు.
చంద్రబాబును టార్గెట్ చేసిన మాజీ మంత్రి రోజా
50 సంవత్సరాలు పైబడిన వారందరికీ 4 వేల రూపాయల పింఛన్ ఇస్తానని చెప్పారని, ఎంత ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఇస్తానన్న హామీలు నెరవేర్చకపోతే వైసిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు నిన్ను నిలదీస్తూ కచ్చితంగా పోస్టులు పెడతారని మాజీ మంత్రి రోజా చంద్రబాబును టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications