బాబు ఆపరేషన్‌కు జగన్ కౌంటర్: వైసిపిలోకి మాజీ ఎమ్మెల్యే
విజయవాడ: కర్నూలు జిల్లా కొడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీ కృష్ణ ఆదివారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. 2009లో కొడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ పైన మురళీ కృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా, మణిగాంధీ టిడిపిలో చేరిన నేపథ్యంలో జగన్ ప్రతివ్యూహానికి తెరలేపారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యేలను లాగుతున్నారు.
ఎమ్మెల్యేలు వరుసగా టిడిపిలో చేరుతుండటంతో సెల్ఫ్ డిఫెన్సులో పడిన జగన్.. ఇటీవలి కాలంలో ముఖ్య నేతలను తమ పార్టీ వైపు ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా మణిగాంధీ వెళ్లిపోవడంతో.. మురళీ కృష్ణను తీసుకున్నారు.

తద్వారా, ఎమ్మెల్యేలు ఖాళీ అయిన నియోజకవర్గాల్లో ఇంఛార్జులను నియమించే ప్రక్రియను చేపట్టారని చెప్పవచ్చు. ఇప్పటికే కొంతమంది ఫిరాయింపుదారుల నియోజకవర్గాల్లో అనధికారిక ఇంఛార్జ్‌లు సిద్ధమయ్యారు. ఇప్పుడు కొడుమూరులో మాజీ ఎమ్మెల్యేను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా జగన్ ఆ నియోజకవర్గానికి ఇంఛార్జిని నియమిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఎస్సీ రిజర్వ్‌డ్ అయిన ఈ నియోజకవర్గం ఆది నుంచి కాంగ్రెస్ ఆ తర్వాత వైసిపికి కంచుకోట. 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యేగా మణిగాంధీ తాజాగా ఫిరాయింపుకు పాల్పడ్డారు.
మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీ కృష్ణ... 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించాడు. విశేషం ఏమంటే.. ఆ ఎన్నికల్లో మురళీ కృష్ణ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేయగా, మణిగాంధీ టిడిపి నుంచి పోటీ చేశాడు. మణిగాంధీపై మంచి మెజారిటీతోనే మురళీ కృష్ణ విజయం సాధించాడు.
ఆ తర్వాత కొంతకాలానికి మణిగాంధీ వైసిపిలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసిపి తరఫున టిక్కెట్ పొందారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మురళీ కృష్ణను చేర్చుకోవడం ద్వారా జగన్ వచ్చే ఎన్నికలకు అభ్యర్థిని సిద్ధం చేసుకున్నారని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications