జనసేన ఎమ్మెల్యే సంపాదన రూ.100 కోట్లు: బయటపెట్టిన టీడీపీ మాజీ మంత్రి- ఆడియో లీక్
Devineni Uma Maheswara Rao: తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో క్లిప్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమిని ఇరకాటంలో పెట్టినట్టయింది.
ఆ ఆడియోలో ఉన్న వాయిస్.. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుది కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పోలవరం జనసేన శాసన సభ్యుడు చిర్రి బాలరాజును ఉద్దేశించి.. అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు కరాటం రాంబాబుతో మాట్లాడిన మాటలు అవి.

పోలవరం ఎమ్మెల్యే ఏడాది కాలంలోనే రూ.100 కోట్లు సంపాదించాడట. ఆయన గొప్పతనం యూట్యూబ్‌లో ఇప్పుడే కనిపించింది. ఏడాదిలో ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎట్లా?. పవన్ కళ్యాణ్ ఏమీ పట్టించుకోరా..' అంటూ దేవినేని ఉమ.. కరాటం రాంబాబుతో మాట్లాడటం ఇందులో రికార్డయింది.
రాంబాబు గారూ.. బాగున్నారా.. ఎక్కడ ఉన్నారు.. అని సంభాషణను మొదలుపెట్టారు దేవినేని ఉమ. ఆ వెంటనే- ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకు వచ్చారు. సంవత్సరంలోనే వంద కోట్లు సంపాదించడం అంటే దేశ చరిత్రలోనే గొప్ప విషయం అని ఎద్దేవా చేశారు.
దీనికి కరాటం రాంబాబు బదులిస్తూ.. ఇప్పుడు వ్యవస్థ అంతా పాడైపోయిందని అన్నారు. సంవత్సరంలోనే ఎందుకు ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు.. ఇంకా నాలుగేళ్లు ఉంది కదా అని దేవినేని చెప్పగా- చెడ్డ పేరు తెచ్చుకోవడమేమిటండీ. పార్టీకి ఎంత డ్యామేజీ. ఎమ్మెల్యే నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కేకలు వేస్తూనే ఉంటాను. అల్లరి ఎక్కువగా జరుగుతోంది.. కరాటం సమాధానం ఇచ్చారు.
ప్రస్తుతం తాను కోర్టు పని మీద రాజమండ్రికి వచ్చానని తన మీద 82 కేసులు ఉన్నాయి కదా అని చెప్పారు దేవినేని. ఇదంతా యూట్యూబ్ లో చూసి ఎలా ఉన్నారు.. ఏమిటని అడుగుదామని ఫోన్ చేశాను. చాలా కష్టపడి మీరు తీసుకువచ్చి పెట్టారు. అందరిని కలుపుకుని మీరు కూడా అంతా తగ్గి ఒప్పించారు.. అని దేవినేని అడగ్గా.. ఇబ్బందిగానే ఉందండి. దానం చేశాం గానీ ఎప్పడూ చెయ్యి చాచడం తెలియదండీ.. కంట్రోల్ చేస్తున్నానండి. మళ్లీ మాములు స్థితికి తీసుకురావాలి. కూటమి అంతా దెబ్బ తినేస్తుందని కరాటం పేర్కొన్నారు.
ఇదంతా పవన్ కళ్యాణ్ కు తెలుస్తుంది కదా..మిమ్మల్ని కూడా అడగటం లేదా? అది పట్టించుకోకండి.. అని దేవినేని సూచించారు. ఇప్పటి వరకు తనకు ఎవరూ ఫోన్ చేయలేదని, వాళ్లు ఫోన్ చేయనప్పుడు నేను కూడా సైలెంట్ గానే ఉన్నానని, మీరు ఫోన్ చేసి చెప్పినప్పుడు పని చేసిపెట్టానని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications