మోడీ, పవన్ కళ్యాణ్ సమక్షంలో బిజెపిలోకి కావూరి!
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు కావూరి సాంబశివ రావు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 30న, మే 1న గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ సీమాంధ్రలో పర్యటించనున్న విషయం తెలిసిందే.
ఈ సమయంలో ఆయన బిజెపిలో చేరనున్నారని తెలుస్తోంది. కావూరి సాంబశివ రావు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరుకు వస్తారు. నాలుగు రోజుల పాటు అక్కడే ఉంటారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన బిజెపిలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారట.

మే 1న జిల్లాలో నిర్వహించి టిడిపి, బిజెపి మిత్రపక్షాల సభలో... నరేంద్ర మోడీ, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ల సమక్షంలో ఆయన బిజెపి తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో ఆయన కాంగ్రెసు పార్టీ పైన ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ నుండి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఆయన ఆసక్తి కనబర్చలేదు. ఆయన బిజెపి వైపు చూడనున్నట్లు కొంతకాలం క్రితం కూడా ప్రచారం జరిగింది.












Click it and Unblock the Notifications