Venkaiah Naidu : ఏపీ రాజధానిపై వెంకయ్య పరోక్ష వ్యాఖ్యలు-వివాదాలు వద్దంటూనే...
ఏపీలో రాజధాని ఏదన్న దానిపై వివాదాలు ముసురుకుంటున్న వేళ.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇవాళ దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. ఎస్.ఆర్.కె.ఆర్ ఇంజనీరింగ్ కళాశాల 43వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ విద్యార్ధులు ఏపీ రాజధానిపై తనను అడిగిన ప్రశ్నకు ఆయన చాలా లౌక్యంగా సమాధానం ఇచ్చారు.
భీమవరంలో వెంకయ్యనాయుడు పర్యటన సందర్భంగా ఆయన్ను ఇంజనీరింగ్ విద్యార్ధులు కలిశారు. వారితో వెంకయ్య కాసేపు చిట్ చాట్ చేసారు. ఈ సందర్భంగా ఏపీ రాజధానిపై వెంకయ్య నాయుడుని విద్యార్థులు ప్రశ్నించారు. ఏపీ రాజధానిగా అమరావతిని చూడాలా.. వైజాగ్ ని చూడాలా.. మీరు క్లారిటీ ఇవ్వండి సార్ అంటూ వెంకయ్య నాయుడుని విద్యార్థినిలు అడిగారు. దీంతో ఆయన స్పందించారు.

ఉపరాష్ట్రపతి పదవుల్లోకి వెళ్లిన తర్వాత, పదవీ విరమణ చేసిన తరువాత రాజకీయాల్లో వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళకూడదంటూ ముందు వెంకయ్య వారిని వారించారు. ప్రజా అభిప్రాయం ప్రకారం పోవాలంటూ వ్యాఖ్యానించారు.
నేను రాజకీయాల్లో లేను కాబట్టి, రాజకీయాలపై వివాదంగా వ్యాఖ్యానిస్తే పెద్ద సమస్యగా మారుతుందన్నారు. అమరావతి పై నా అభిప్రాయం ముందే తెలియపరిచానన్నారు. తాను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి తో కలిసి అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నానని, పట్టణాభివృద్ధి మంత్రిగా నిధులు కూడా మంజూరు చేశానని వెంకయ్య తెలిపారు.
ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది... అంటూ విద్యార్థులతో వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. తద్వారా ఏపీ రాజధాని అమరావతే అని ఆయన చెప్పకనే చెప్పారు. కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐడియా ల్యాబ్ ను ప్రారంభించిన వెంకయ్య నాయుడు.. ఐడియా ల్యాబ్ లోని పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం సృజనవాటిక చిరుధాన్యల వంటలను ప్రదర్శనను పరిశీలించారు.
Venkaiah Naidu : ఏపీ రాజధానిపై వెంకయ్య పరోక్ష వ్యాఖ్యలు-వివాదాలు వద్దంటూనే...#andhrapradesh, #bhimavaram, #venkaiahnaidu pic.twitter.com/CuoM45btfq
— oneindiatelugu (@oneindiatelugu) February 11, 2023












Click it and Unblock the Notifications