త్వరలో ఆ పార్టీలోకి ఆమంచి కృష్ణమోహన్ -చీరాల నుంచే పోటీ..!
ప్రకాశం జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఈ మధ్యే వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన సొంత నియోజకవర్గం చీరాల టికెట్ నిరాకరించి పర్చూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా నియమించడంతో ఆయన వైసీపీని వీడారు. దీంతో ఎన్నికల వేళ ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా అనుచరులతో భేటీ అయిన ఆమంచి కీలక నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీని వీడాక ఏ పార్టీలో చేరాలన్న దానిపై అనుచరులతో భేటీ అయిన ఆమంచి కృష్ణమోహన్ కు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చాక కాంగ్రెస్ పార్టీలో కదలిక వచ్చింది. తాజాగా పలువురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ లో చేరారు. ఈ నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ కూడా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు.

త్వరలోనే వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఆమంచి కృష్ణమోహన్ ఇవాళ ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అంటే గౌరవం ఉన్నా తన భావజాలానికి ఆ పార్టీ సరిపోదన్నారు. అలాగే వైసీపీలోనూ తనకూ, జగన్ కు ఎలాంటి గ్యాప్ లేదన్నారు. వైసీపీలో తనకు సముచిత స్ధానమే దక్కిందన్నారు. అయితే వైసీపీ హైకమాండ్ చీరాల కాకుండా పర్చూరు నుంచి పోటీ చేయమని కోరడం వల్లే తాను బయటికి వచ్చానన్నారు. త్వరలో కాంగ్రెస్ లో చేరి చీరాల నుంచి పోటీ చేసేందుకు ఆమంచి సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications