ఇంతకీ చంద్రబాబు నుంచి మీరెంత పుచ్చుకున్నారు..?
Gadikota Srikanth Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన నాయకుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలపై కౌంటర్లు పడుతున్నాయి. ఈ క్రమంలో పాత విషయాలన్నింటినీ తవ్వి తీస్తున్నారు ఆ పార్టీ నాయకులు. చంద్రబాబు నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ 2018లో పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనను బయటపెట్టారు.
2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మీద హత్య ప్రయత్నానికి కుట్ర జరిగిందని, ఆ వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని పవన్ కల్యాణ్ చెప్పాడే గానీ అవి ఇంతవరకు బయటకు ఎందుకు ఇవ్వలేదని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్‌లో తన ఇంటి దగ్గర కొంతమంది తచ్చాడుతున్నారని, వారికి జగన్ మనుషులు సుపారీ ఇచ్చారని పవన్ ఆందోళన వ్యక్తం చేశారని అన్నారు. దీనిపై విచారణ చేసిన హైదరాబాద్ పోలీసులు- వాళ్ళు తాగుబోతులని తేల్చి చెప్పిన విషయాన్ని నాగబాబుకు గుర్తు చేశారు.
వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ పనిచేంది విశాఖపట్నం విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌లోనని, దాని యజమాని అప్పటి అధికార టీడీపీ నేత హర్షవర్థన్ చౌదరి సాక్షాత్తూ మంత్రి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడని, 2014 నాటి ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించారని జీ శ్రీకాంత్ రెడ్డి వివరించారు.
ఆయన 2017లో విమానాశ్రయంలో రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కించుకున్నది టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కేంద్ర విమానయాన శాఖమంత్రిగా ఉన్నప్పుడేనని పేర్కొన్నారు. నిందితుడు జనుపల్లి శ్రీనివాస్‌పై ఆయన స్వస్థలం ఠానేలంకలో పలు వివాదాల్లో ఉన్నట్టు ముమ్మడివరం పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసులు సైతం పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు.
అలాంటి వ్యక్తిని రెస్టారెంట్‌లో చేర్చుకోవడానికి దాని యజమానే విశాఖ ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకుని ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులకు ఇచ్చి.. అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదని చెప్పాడని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. ఠానేలంక పరిధిలోకి వచ్చే పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ అధికారులు స్పష్టంగా చెప్పినా దాన్ని పట్టించుకోకుండా తన రెస్టారెంట్‌లో ఉద్యోగం కల్పించడం వెనుక పక్కా కుట్ర ఉందని అన్నారు.
విశాఖపట్నం విమానాశ్రయంలో 2018 అక్టోబర్ 25వ తేదీన వైఎస్ జగన్‌పై శ్రీనివాసరావు హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ ఈ ఘటనపై ఎన్ఐఏ సైతం హైకోర్టులో వాంగ్మూలం ఇచ్చిందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని కూడా కోరిందని అన్నారు. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయాక.. అవినీతి టీడీపీ పార్టీ పని అయిపొయిందని, ఇక పోటీ జనసేన- వైసీపీ మధ్యే అని నాగబాబు చెప్పిన వీడియోలు ఉన్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications