కారెక్కనున్న మరో నలుగురు విపక్ష ఎమ్మెల్యేలు?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో ప్రతిపక్షాలకు చెందిన మరో నలుగురు శాసనసభ్యులు చేరనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నలుగురిలో కాంగ్రెసు శాసనసభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. కెసిఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ తక్షణ చర్చకు పట్టుబట్టి కాంగ్రెసు శాసనసభ్యులు మంగళవారంనాడు శాసనసభ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు.
తమ పార్టీ శాసనసభ్యులను నిలువరించుకోవడానికే కాంగ్రెసు శాసనసభ్యులు శాసనసభలో దుమారం రేపినట్లు భావిస్తున్నారు. అయినప్పటికీ టిఆర్ఎస్‌లోకి వలసలు ఆగే పరిస్థితి లేదని అంటున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ లక్ష్యాన్ని సాధించేందుకే తాము టిఆర్ఎస్‌లో చేరుతున్నట్లు పార్టీ మారుతున్న శాసనసభ్యులు చెబుతున్నారు.
ఇటీవలే టిఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెసు శాసనసబ్యుడు కె. యాదయ్య వ్యవహారంపై అధికార టిఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్షాలకు మధ్య శాసనసభ ఆవరణలో మాటల యుద్ధం నడిచింది. ఇప్పటి వరకు టిఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెసు, తెలుగుదేశం, బిఎస్పీ శాసనసభ్యులు శాసనసభలో ప్రతిపక్షాలకు కేటాయించిన సీట్లలోనే కూర్చుంటూ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు.

ఎన్నికల్లో టిఆర్ఎస్ 63 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు ఆ పార్టీ సభ్యుల బలం 73కు చేరుకుంది. ప్రతిపక్షాల నుంచి పది మంది శాసనసభ్యులు టిఆర్ఎస్‌లో చేరారు. శాసన మండలిలో కూడా టిఆర్ఎస్ బలం పెరిగింది. ఫిరాయింపులను అధికార టిఆర్ఎస్ ప్రోత్సహిస్తుండడాన్ని నిరసిస్తూ కాంగ్రెసు సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి సోమవారం అసెంబ్లీకి వచ్చారు.
తాము పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ ఫిరాయింపులపై శానససభ స్పీకర్ మధుసూదనచారీ గానీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ గానీ ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌పై, పార్టీలు మారిన శానససభ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు గవర్నర్ నరసింహన్‌ను కోరారు.
అయితే, టిఆర్ఎస్ వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన ఫిరాయింపులను ముందుకు తెచ్చి కాంగ్రెసును తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో తమ పార్టీకి చెందిన పది మంది శాసనసభ్యులను చేర్చుకున్నారని, అప్పుడు ఎందుకు మాట్లాడలేదని టిఆర్ఎస్ వాదిస్తోంది.












Click it and Unblock the Notifications