గుడ్ న్యూస్.. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం డేట్ ఫిక్స్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ హామీని నెరవేర్చడానికి ఇప్పటికే చంద్రబాబు సర్కార్ రెడీ అయింది. ఎప్పుడెప్పుడా ఉచిత బస్సు ప్రయాణం అని ఎదురుచూస్తున్న మహిళలకు తాజాగా ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శ్రావణంలో శుభవార్త చెప్పారు.
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం రివ్యూ
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ, రవాణా శాఖలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన ఈనెల 12వ తేదీన సీఎం చంద్రబాబు సమీక్షిస్తారని మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపైన అధికారులతో చర్చిస్తారని తెలిపారు. టిడిపి ప్రభుత్వం త్వరలోనే తామిచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని నిలబెట్టుకుంటుందని మంత్రి మండిపల్లి తెలిపారు.

మహిళల ఉచిత బస్సు ప్రయాణం అప్పటి నుండే
గత కొద్ది రోజులుగా ఆగస్టు 15వ తేదీ నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 12వ తేదీన సీఎం చంద్రబాబు రివ్యూ సమావేశంపైన ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే గత ఐదేళ్ల జగన్ పాలనలో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైందని మంత్రి మండిపల్లి మండిపడ్డారు. కారుణ్య నియామకాలపైన చర్చించామని పేర్కొని, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపైన సీఎంతో త్వరలోనే చర్చిస్తామన్నారు.
జగన్ ఆర్టీసీని నాశనం చేశారు
ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులను తొలగించి కొత్త బస్సులను తీసుకొస్తామని ,ఆర్టీసీలో 7000 మంది సిబ్బంది కొరత ఉందని, వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆర్టీసీ విలీనం పేరుతో జగన్ ఆర్టీసీ కార్మికుల జీవితాలతో చెలగాటమాడాడని నిప్పులు చెరిగారు. ఇక రవాణా శాఖ పై నిర్వహించిన సమీక్షలో కొంతమంది అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రవాణా అధికారులకు మంత్రి క్లాస్
కొందరి అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి గండి కొడుతున్నారని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఇక రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తుంటే ఆర్టిఏ అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. అక్రమంగా ఇసుక, మైనింగ్ రవాణా చేస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేయడం లేదు ఎందుకని మంత్రి మండిపడ్డారు. అధికారులు కట్టుదిట్టంగా వ్యవహరించాలని, అక్రమాలకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేలా చూడాలని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications