ఆ నిర్ణయమే టీడీపీ "భవిష్యత్" కి కీలక మలుపు..!!
ఒక్క పాదయాత్ర రాష్ట్ర రాజకీయ చరిత్రనే మార్చేసింది. అవమానాలు ఎదుర్కొన్న యువనేత ను నాయకుడి ని చేసింది. వేధించిన పాలకులకు చమర గీతం పాడింది. సంక్షోభమే అవకాశం గా మారింది. అదే అనూహ్య ప్రజా విజయాన్ని అందించింది. కూటమి ప్రభుత్వానికి నాందిగా నిలిచింది. యువగళ మే ప్రజాగళమై ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు కారణమైంది. ఆ యవగళం రాటు తేల్చిన నేతే నారా లోకేష్. మంత్రిగా అటు పార్టీ .. ఇటు ప్రభుత్వంలో కీలకంగా మారారు. యువగళం నేటితో ఏడాది పూర్తి చేసుకుంటున్న వేళ.. లోకేష్ ను పోరాట యోధుడిగా పార్టీ గుర్తు చేసుకుంటోంది.
యాత్రతోనే మొదలు
నారా లోకేష్. యవగళం ముందు..ఆ తరువాత అని చెప్పుకొనే స్థాయిలో ఎదిగిన నేత. తండ్రి స్పూర్తితో పార్టీ కోసం.. నాటి ప్రభుత్వంలో బాధలు పడుతున్న వారికి అండగా నిలిచేందుకు గత ఏడాది జనవరి 27న కుప్పం నుంచి నారా లోకేష్ యువగళం యాత్ర మొదలైంది. లోకేష్ ఎక్కువ రోజులు నడవలేరని అవహేళన చేసిన వారికి తన యాత్రతోనే సమాధానం చెప్పారు. ప్రజలతో మమేకం అవుతూ వారికి దగ్గరయ్యారు. యాత్ర సాగే కొద్దీ స్పందన పెరిగింది. ప్రజా సమస్యల పైన అవగాహన వచ్చింది. ప్రజలు ఏం కోరుకుంటున్నారో అర్దమైంది. ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందో గుర్తించారు. తమ పార్టీలో సమస్యలను తెలుసుకున్నారు. అదే ఎన్నికల్లో మేనిఫెస్టోతో పాటుగా అభ్యర్దుల ఖరారులో కీలకంగా మారింది.

అవరోధాలు అధిగమించి
కుప్పంలో ప్రారంభమైన యాత్ర 11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2 వేల 28 గ్రామాల మీదుగా 226 రోజులు కొనసాగింది. లోకేష్ యాత్రను అడ్డుకునేందుకు నాటి ప్రభుత్వం అవరోధాలు సృష్టించింది. అక్రమ కేసులు పెట్టి వేధించింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రతీ రోజూ వెయ్యి నుంచి పదిహేను వందల మంది పార్టీ నాయకుల తో పాటుగా కార్యకర్తలను కలిసేవారు. వారి నుంచి సేకరించిన సమాచారం.. క్షేత్ర స్థాయి వాస్తవాలు.. నాటి ప్రభుత్వం అణచివేత లోకేష్ ను రాజకీయంగా రాటు తేల్చాయి. అన్ని వర్గాలతో లోకేష్ మమేకం అయ్యారు. సమస్యలతో వచ్చిన వారికి భరోసా నింపారు. అయితే సెప్టెంబరు 9న చంద్రబాబు అరెస్టుతో పాదయాత్రకు సుదీర్ఘ విరామం ఏర్పడింది.
రాటు తేల్చిన యాత్ర
ఆ సమయంలో లోకేష్ పైన పెద్ద బాధ్యత ఏర్పడింది. చంద్రబాబు అరెస్ట్ తో పార్టీలో అలజడి లేకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తండ్రి కేసులో ఢిల్లీ కేంద్రంగా న్యాయ నిపుణులతో చర్చలు చేసారు. ఆ సమయంలోనే పొత్తుల అంశం పైన ఢిల్లీలో కసరత్తు మొదలైంది. ఆ వేళ తన పరిణితి ప్రదర్శించారు. యువగళం యాత్ర వేళ లోకేష్ పైన మొత్తంగా 25 వరకు కేసులు నమోదు అయ్యాయి. 40 మంది యువగళం వాలంటీర్లపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకి పంపారు. గన్నవరం నియోజకవర్గంలో విదేశాలతో ఉన్నవారు సహా 46 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. ఇవన్నీ లోకేష్ లో మరింత కసిని పెంచాయి. దీని ఫలితమే రెడ్ బుక్. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారుల పైన చర్యలు తప్పవనే నాటి హెచ్చరికలు నేడు అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్నారు.
అధికారం లో కీలకంగా
అనేక వర్గాలతో యువగళం లో సమావేశాలు నిర్వహించారు. మొత్తంగా 70 బహిరంగ సభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని, ప్రజల నుంచి వినతి పత్రాలు అందుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రను అగనంపూడి వద్దే సరిగ్గా ఏడాది క్రితం యువగళం యాత్ర ముగించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద తెలుగుదేశం విజయోత్సవ సభను నిర్వహించారు. ఆ యువగళం యాత్ర స్పూర్తితోనే ఎన్నికల్లో పార్టీ శ్రేణుల్లో గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పని చేసేలా కదిలించింది. కూటమి ఎన్నికల్లో 164 సీట్లతో అధికారంలోకి రావటానికి చంద్రబాబు అరెస్ట్.. లోకేష్ యువగళం టీడీపీ కేడర్ కు టానిక్ లా పని చేసాయి.
పార్టీ - ప్రభుత్వానికి వారధి..సారధి
లోకేష్ పార్టీలో ఎంట్రీ సమయం నుంచి కార్యకర్తల పైనే ఎక్కువగా ఫోకస్ చేసారు. దేశంలో మరే ఇతర పార్టీకి లేని సైన్యం టీడీపీకి ఉంది. కార్యకర్తలకు భీమా సౌకర్యం తీసుకొచ్చారు. పార్టీ - ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచారు. అదే విధంగా అధికారంలోకి వచ్చిన తరువాత కీలక మైన విద్యాశాఖ పర్యవేక్షిస్తున్నారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇక, ప్రజా దర్బార్ ద్వారా ఇబ్బందుల్లో ప్రతీ ఒక్కరికీ బాసటగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో కష్టంలో ఉన్నామంటూ పోస్టింగ్ పెడితే వెంటనే స్పందిస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. పాలనలో తండ్రికి చేదోడుగా ఉంటూ.. కూటమి విజయానికి కష్ట పడి పని చేసిన వారికి గుర్తింపు ఇవ్వటంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. నాటి యువగళం నేటి అధికారం వెనుక ముఖ్య భూమిక పోషిస్తే...లోకేష్ - టీడీపీ భవిష్యత్ కు పునాదిగా నిలిచి ఏపీలో సరి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.












Click it and Unblock the Notifications