ఏపీలో ఆ నిధుల విడుదల.. వాయిదా
అమరావతి: ఏపీలో రైతు భరోసా పథకం కింద కౌలు రైతులకు నిధులను విడుదల చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. సెప్టెంబర్ 1వ తేదీ నాటికి అంటే శుక్రవారానికి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలిపింది. షెడ్యూల్ ప్రకారం.. ఈ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద నిధులను విడుదల చేయాల్సి ఉంది.
తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా కౌలు రైతుల ఖాతాల్లోకి 7,500 రూపాయల చొప్పున నగదు మొత్తాన్ని జమ చేయడానికి ఏర్పాట్లు పూర్తయినప్పటికీ.. చివరి నిమిషంలో ఈ కార్యక్రమం వాయిదా పడింది. దేవదాయ భూములను సాగు చేసుకుంటోన్న రైతులను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. వారికీ ఈ నగదు మొత్తం అందుతుంది.

కౌలు రైతులను గుర్తించడానికి ప్రభుత్వం ఇదివరకే క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ కార్డులను అందజేసిన విషయం తెలిసిందే. మొత్తంగా 1,42,693 మంది ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనారిటీ కౌలుదారులకు సీసీఆర్సీలను అందజేసింది. వారిని కౌలు రైతులుగా గుర్తించినట్టయింది. వారితో పాటు మరో 3,631 మంది దేవాదాయ భూముల సాగుదారులకు కూడా సీసీఆర్సీ కార్డులను మంజూరు చేసింది.
దేవాదాయ భూములను సాగు చేసుకుంటోన్న కౌలు రైతులకు రైతు భరోసా పథకం కింద నిధులను విడుదల చేయబోతోండటం ఇదే తొలిసారి. 7,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయనుంది ప్రభుత్వం. మొత్తం 109.74 కోట్ల రూపాయలను దీనికోసం వ్యయం చేయనుంది. బటన్ నొక్కి ఈ మొత్తాన్ని లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బును జమ చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 76.21 లక్షల మంది రైతులు ఉన్నారు. వారిలో కౌలు రైతులు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి సీసీఆర్సీ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. ఈ కార్డులను జారీ చేయడం ద్వారా కౌలు రౌతులను అధికారికంగా గుర్తించింది. వారికి పంట రుణాలతో పాటు వైఎస్సార్ రైతు భరోసా కింద నగదు సాయం అందజేస్తోంది.












Click it and Unblock the Notifications